Hyderabad – June 2 : జూన్ 2 చాలా కీలకమైన తేదీ.. ఎందుకంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కాలపరిమితి ఆరోజుతో ముగియనుంది. ఇప్పుడు ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు పూర్తయినందున రాష్ట్రాల విభజనకు సంబంధించిన అపరిష్కృత అంశాలను తదుపరిగా ఏర్పడబోయే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఫలితంగా సాధ్యమైనంత మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించాలని యోచిస్తున్నారు. ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పుల విభజనకు సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక తయారు చేయాలని అధికారులను రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఏకాభిప్రాయంతో విభజన జరిగిన అంశాలు, విభజన విషయంలో పెండింగ్‌లో ఉన్న వాటి వివరాలన్నీ రిపోర్టులో పొందుపరచాలని సూచించారు.
We’re now on WhatsApp. Click to Join
ఏపీతో సయోధ్య కుదరని అంశాల విషయంలో..
షెడ్యూల్ 9, 10లోని సంస్థల విభజన ఇంకా పూర్తి కాలేదని ఈసందర్భంగా ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. పలు అంశాలపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని, విద్యుత్తు సంస్థల బకాయిల వివాదం తేలలేదన్నారు. ఉద్యోగుల బదిలీలతో ముడిపడిన ఇరురాష్ట్రాల అంశాలను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సీఎం తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య విభజన విషయంలో సయోధ్య కుదరని అంశాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తదుపరి కార్యాచరణను రెడీ చేయాలని రేవంత్ నిర్దేశించారు. ఉమ్మడి రాజధాని కాల పరిమితి పూర్తి కానున్నందున హైదరాబాద్‌లో ఏపీకి కేటాయించిన లేక్ వ్యూ గెస్ట్ హౌజ్ వంటి భవనాలను జూన్ 2(Hyderabad – June 2) తర్వాత స్వాధీనం చేసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.ఇక ఈ నెల 18న జరగనున్న తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో విభజన అంశాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Also Read :National Dengue Day : డెంగ్యూ లక్షణాలు, చికిత్స, నివారణ చర్యలు ..!
రైతు రుణమాఫీకి రంగం సిద్ధం
ఆగస్టు 15 నాటికి రైతు రుణమాఫీకి విధివిధానాలు, నిధుల సమీకరణ ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఇప్పటికే రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రూ.2 లక్షల రుణమాఫీకి అవసరమైన విధి విధానాలు, ప్రణాళికలను తయారు చేయాలన్నారు. అవసరమైతే రైతుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి, రుణమాఫీకి అవసరమైన నిధులను సర్దుబాటు చేయాలన్నారు. రైతు రుణమాఫీ కోసం మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. వీటితో పాటు ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళికపైనా మంత్రిమండలి భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది.