Site icon HashtagU Telugu

Hyderabad Pollution: అత్యధిక కాలుష్యం ఉన్న నాలుగో నగరంగా హైదరాబాద్

Delhi Air Pollution

Delhi Air Pollution

హైదరాబాద్ పై కాలుష్యం పంజా విసురుతోంది. దీంతో హైదరాబాద్ నగరం నివాస యోగ్యానికి అనుకూలం కాని స్థితికి చేరుతోంది. దేశంలో ఢిల్లీ, కోల్ కతా, ముంబై తర్వాత అత్యధిక కాలుష్యం ఉన్న నాలుగో నగరంగా హైదరాబాద్ ను ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ప్రకటించింది. దక్షిణాదిలో అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో 159 పాయింట్లతో నగరంలోని కాలుష్యం అనారోగ్యకర స్థితికి చేరింది. స్విట్జర్లాండ్ కు చెందిన ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ కంపెనీ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ను ఏటా విడుదల చేస్తుంటుంది.

మరి భాగ్యనగరంలో కాలుష్యానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు? పార్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం) 2.5 ధూళి కణాలే. ముఖ్యంగా మోటారు వాహనాల నుంచి వెలువడుతున్న కాలుష్యం, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం పీఎం 2.5 స్థాయిని పెంచేస్తున్నాయి. నగరంలోని కాలుష్యంలో మూడింట ఒకటో వంతు వాహనాల వల్లేనని తెలుస్తోంది. పీఎం 2.5 హైదరాబాద్ లోని క్యూబిక్ మీటర్ గాలిలో 70.4 మైక్రో గ్రాములకు చేరింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన గరిష్ట పరిమితి 5 మైక్రో గ్రాముల కంటే ఇది 14 రెట్లు అధికం.

వైద్య నిపుణులు దీనిపై నగరవాసులను హెచ్చరిస్తున్నారు. పీఎం 2.5 కణాలు మన కంటికి కనిపించవు. అందుకే ముక్కులోని వెంట్రుకలు వీటిని అడ్డుకోలేవు. దీంతో గాలి ద్వారా ఇవి ఊపిరితిత్తుల్లోకి చేరి, అక్కడి నుంచి రక్తంలో కలుస్తాయి. దీర్ఘకాలంలో కేన్సర్ సహా ఎన్నో సమస్యలకు ఇవి కారణమవుతాయి. వాహనాల సంఖ్య జంటనగరాల్లో ఏటేటా పెద్ద ఎత్తున పెరుగుతోంది. ఇవి వెలువరించే కాలుష్య ఉద్గారాలకు తోడు, నిర్మాణ వ్యర్థాలు, చెత్తను బహిరంగ ప్రాంతాల్లో మంట పెడుతుండడం కాలుష్యాన్ని మరింత పెంచేస్తున్నాయి. 2021 నాటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం హైదరాబాద్ లో పీఎం 2.5, 39.4 మైక్రో గ్రాములుగానే ఉంది. కానీ, ఏడాది తిరిగే సరికి 70.4 మైక్రో గ్రాములకు పెరిగింది. సనత్ నగర్, జూ పార్క్, బొలారం ప్రాంతాల్లో పీఎం 2.5, పీఎం 10 అత్యధికంగా నమోదయ్యాయి. పీఎం 10 ధూళి కణాలు సైతం భాగ్యనగరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ గరిష్ట పరిమితి 60 దాటిపోయి 75-80 మైక్రో గ్రాములకు చేరాయి.

Exit mobile version