Site icon HashtagU Telugu

Heavy Rain In Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు!

Heavy Rain In Hyderabad

Heavy Rain In Hyderabad

Heavy Rain In Hyderabad: గత రెండు గంట‌ల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు భాగ్యనగరం (Heavy Rain In Hyderabad) అతలాకుతలమైంది. అల్పపీడనం ప్రభావంతో పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, ఖైరతాబాద్, ఎల్బీ నగర్, పెద్దఅంబర్‌పేట్ వంటి ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. రోడ్లపై భారీగా నీరు నిలవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ముఖ్యంగా ఖైరతాబాద్-రాజ్‌భవన్ రోడ్డులో మోకాలి లోతు వరకు నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. నగరంలో వరదనీరు నిలిచిన ప్రాంతాల్లో జీహెచ్‌ఎంసీ, హైడ్రా సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.

వాతావరణ హెచ్చరికలు

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వల్ల అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం రాగల 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి వాయువ్య బంగాళాఖాతం వైపు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రాత్రి, మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు వెల్లడించారు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌లు జారీ చేశారు. అంతేకాకుండా ఈ నెల 25న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దాని ప్రభావంతో 25, 26 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆయన తెలిపారు.

మేయర్ సమీక్ష, హెచ్చరిక

భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నగరంలో పర్యటించారు. ముఖ్యంగా కేసీపీ జంక్షన్ కూడలి వద్ద భారీగా నిలిచిన వరదనీటిని ఆమె పరిశీలించారు. వర్షపు నీరు నిలవడంతో వివి స్టాట్యూ నుంచి కేసీపీ జంక్షన్, నిమ్స్ రోడ్డు వరకు వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన మేయర్.. జీహెచ్‌ఎంసీ, హైడ్రా, ట్రాఫిక్ పోలీసులతో కలిసి క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించారు. వరదనీటిని వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఆమె దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు.

Also Read: PM Modi: దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ..!

ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దని సూచించారు. ట్రాఫిక్ జామ్ దృష్ట్యా వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వర్షం తగ్గుముఖం పట్టే వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

రోడ్లు జ‌ల‌మ‌యం

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మాదాపూర్, కృష్ణానగర్, అమీర్‌పేట్, ఎస్‌ఆర్ నగర్ వంటి ప్రాంతాల్లో దంచికొట్టిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడంతో అనేక ప్రాంతాల్లో వరద తీవ్రత పెరిగింది.

వరదనీటితో ఇబ్బందులు

వరద నీరు రోడ్లపై చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. దీనివల్ల ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. లోతట్టు ప్రాంతాల్లోని కొన్ని కాలనీల్లో వరద నీరు ఇళ్లలోకి చేరి ప్రజలకు నష్టం కలిగించింది. కొన్నిచోట్ల బైకులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. వర్షపు నీరు ఇంజిన్‌లోకి చేరడంతో అనేక టూవీలర్లు మొరాయించాయి.

ట్రాఫిక్ పోలీసుల సూచనలు

భారీ వర్షం, ట్రాఫిక్ జామ్ దృష్ట్యా హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు పలు సూచనలు చేశారు. రోడ్లపై గుంతలు ఉండే అవకాశం ఉందని, వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని హెచ్చరించారు. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. ఆకాశం ఇంకా మేఘావృతమై ఉన్నందున, మరింత వర్షం కురిసే అవకాశం ఉంది.

Exit mobile version