Site icon HashtagU Telugu

Gaddar: నమో.. గద్దరన్న!

Gaddar2

Gaddar2

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కమ్యూనిస్టు, విప్లవ కవి గద్దర్ ప్రత్యక్షం కావడం ప్రతిఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గద్దర్ తనను తాను సెక్యులరిజం బేరర్‌గా అభివర్ణించుకున్నాడు. గతంలో అటు సమాజంలోని వివిధ వర్గాలకు అన్యాయంపై, ఇటు బీజేపీ ఎజెండాకు వ్యతిరేకంగా గళం విప్పారు కూడా. అతని పాటలు కవిత్వం ఎల్లప్పుడూ అతని భావజాలాన్ని వ్యక్తపరుస్తాయి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఆయన కవిత్వం ముఖ్యపాత్ర పోషించింది. బహిరంగ సభలలో తన పాటల ద్వారా ఎంతోమందిని ప్రభావితం చేశాడు. అయితే తన సొంత సిద్ధాంతాలను ధిక్కరిస్తూ బీజేపీ బహిరంగ సభకు హాజరు కావడం పలువురిని ఆశ్చర్యపరిచింది. బీజేపీ బహిరంగ సభలో మొదటి నుంచి చివరి వరకు ఆయన హైలైట్ గా నిలిచారు. తన సొంత రాజకీయ ఆలోచనలను, సిద్ధాంతాలను ధిక్కరించడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ చాలాసార్లు గతానికి భిన్నంగా వ్యవహరించారు.

డిసెంబర్ 2021లో గద్దర్ తన కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి మందిరాన్ని సందర్శించారు. ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించేందుకు వచ్చానని చెప్పుకొచ్చాడు. 1997లో చంద్రబాబు నాయుడు హయాంలో దేవేంద్రగౌడ్ మంత్రిగా ఉన్నప్పుడు కొందరు ఆయనపై కాల్పులు జరపడంతో చాలా బుల్లెట్లు ఆయనకు తగిలాయి. దానిని తొలగించడానికి ఆపరేట్ చేయడం ప్రమాదకరం కాబట్టి ఒక బుల్లెట్ మినహా అన్ని బుల్లెట్లను తొలగించారు. ఈ ఘటనను పట్టించుకోకుండా 2018లో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడును ఆలింగనం చేసుకుని మహాకూటమికి మద్దతు పలికారు. దేవేందర్ గౌడ్ తెలుగుదేశం నుంచి విడిపోయి నవ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు గద్దర్ ఆయనకు సహకరించారు. పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న గద్దర్‌తో బీజేపీ కార్యకర్తలు సెల్ఫీలు దిగారు. వీఐపీ పాస్‌తో ఆయన సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణపై ప్రధాని ఏం మాట్లాడుతున్నారో వినడానికే వచ్చానని గద్దర్ అన్నారు.