Site icon HashtagU Telugu

Hyderabad Collector : హైదరాబాద్ కలెక్టర్ కారెక్కబోతున్నారా? మరో రెండు నెలల్లో…!

L Sharman

L Sharman

తెలంగాణలో టీఆర్ఎస్ తీర్థంపుచ్చుకోవడానికి కొంతమంది కలెక్టర్లు పోటీ పడుతున్నట్టే కనిపిస్తోంది. ఇప్పటికే సిద్దిపేట కలెక్టర్ గా చేసిన వెంకట్రామిరెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. పెద్దల సభకు వెళ్లారు. ఇది జరిగి కొద్ది నెలలే అయ్యింది. ఇప్పుడు హైదరాబాద్ కలెక్టర్ గా ఉన్న ఎల్.శర్మన్ కూడా అదే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. మరో రెండు నెలల్లో రిటైర్ అవ్వబోతున్నారు. అందుకే ఆయన కూడా రాజకీయాల్లోకి రావడానికి గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారు.

కలెక్టర్ గా ఉన్నా.. జనం సమస్యలు తెలుసుకోవడానికి బైక్ పై పర్యటించడం కలెక్టర్ ఎల్.శర్మన్ కు అలవాటు. అలా బస్తీలు, మురికివాడల్లో ఆయన పర్యటిస్తూనే ఉంటారు. అందుకే రిటైర్ అయిన తరువాత కూడా అదే సేవను కంటిన్యూ చేయడానికి వీలుగా రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆదిలాబాద్ లోక్ సభ లేదా ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏదైనా ఒక దాని నుంచి పోటీ చేయాలనిఆయన అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ రెండూ రిజర్వుడ్ స్థానాలే.

ఇదే ప్రశ్న ఎవరైనా వేసినా.. ఇంకా రిటైర్ మెంట్ కు రెండు నెలల సమయముందని.. ఆ తరువాత ఏం జరుగుతుందో చెప్పలేం కదా అని దాటవేస్తున్నారని తెలుస్తోంది. శర్మన్.. కెరీర్ కొత్తలో గ్రూప్-1 అధికారిగా బాధ్యతలు చేపట్టారు. తరువాత చాలా రకాల బాధ్యతల్లో రాణించారు. మహబూబ్ నగర్ జేసీగా పనిచేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గా సేవలు అందించారు. జీహెచ్ఎంసీ అదనపు కార్యదర్శిగా కూడా పనిచేశారు.

శర్మన్ బంధువుల్లో చాలామంది ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. అందుకే ఆయన కూడా రిటైర్ మెంట్ తరువాత క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి.. జనం మనసు గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. పోటీ చేయాలని భావిస్తున్న ఆ రెండు నియోజకవర్గాల్లోని నాయకులతోనూ ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. అందుకే ఆయన ఎంట్రీ ఖాయమని ఆయన సన్నిహితులు అంటున్నారు.

Exit mobile version