Site icon HashtagU Telugu

Hyderabad Chicken Lovers: హైదరాబాద్ లో గలీజ్ చికెన్ దందా చికెన్ ప్రియుల‌కు షాకింగ్ !

Hyderabad Chicken Lovers

Hyderabad Chicken Lovers

హైదరాబాద్‌లో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మరో గలీజ్ దందా గుట్టురట్టు చేశారు. కుళ్లిన కోడి మాంసం బార్లు, హోటళ్ల, కళ్లు కాంపౌండ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కిలో చికెన్‌ను కేవలం 30 నుంచి 50 రూపాయల ధరకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు బేగంపేట ప్ర‌కాశ్‌న‌గ‌ర్‌లోని చికెన్ సెంటర్‌పై ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో 700 కిలోల కుళ్లిన కోడి మాంసం ప‌ట్టుబ‌డింది. విక్రయదారుడు బాలయ్యతో పాటు 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బాలయ్య గతంలో కంటోన్మెంట్ ప్రాంతంలోని రసూల్‌పురలో కూడా ఇలాంటి చికెన్ సెంటర్‌ను నడిపించినట్లు పోలీసులు వెల్లడించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఆ కేంద్రాన్ని మూసివేసిన తర్వాత, అతను తన వ్యాపారాన్ని ప్ర‌కాశ్‌న‌గ‌ర్‌కు మార్చుకున్నాడు.

చెన్నై, ముంబై వంటి నగరాల నుంచి కుళ్లిన కోడి మాంసాన్ని తక్కువ ధరకు తీసుకొచ్చి, దాన్ని సంచుల్లో నింపి నగరంలోని బార్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, హోటళ్లకు విక్రయిస్తున్నాడు. కిలో మాంసం కేవలం 30 నుంచి 50 రూపాయలకు అమ్ముతున్నట్లు తెలిసింది. ప్రస్తుతానికి పోలీసులు స్వాధీనం చేసుకున్న 700 కిలోల మాంసం 10 నుండి 30 రోజుల నాటిదిగా నిర్ధారించారు.