Site icon HashtagU Telugu

Hyderabad CCS : హైదరాబాద్‌ సీసీఎస్‌ నుంచి 12 మంది ఇన్‌స్పెక్టర్ల బదిలీ.. ఎందుకు ?

Hyderabad Ccs

Hyderabad Ccs

Hyderabad CCS : నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌)లో దిద్దుబాటు చర్యలను సీఎం రేవంత్ సర్కారు మొదలుపెట్టింది. హైదరాబాద్‌‌లో పోలీసు విభాగానికి గుండెకాయ లాంటి సీసీఎస్‌లో ప్రక్షాళనను షురూ చేసింది. సీసీఎస్ అవినీతికి అడ్డాగా మారిందనే ఆరోపణల నేపథ్యంలో హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.  12 మంది సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్లను మల్టీజోన్‌-2కు ట్రాన్స్‌ఫర్ చేశారు. వెంటనే రిపోర్ట్‌ చేయాలని సీపీ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌ సీసీఎస్‌లో ఇటీవల ఏసీపీ ఉమామహేశ్వరరావు, ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. వారిపై సస్పెన్షన్‌ వేటు పడింది.  ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మే 21న ఏసీపీ టీఎస్‌ ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. తాజాగా గత గురువారం ఈఓడబ్ల్యూ టీమ్‌–7 ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ రూ.3 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఈ పరిణామాల నేపథ్యంలో సీసీఎస్‌‌ నుంచి 12 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేయడం గమనార్హం.

We’re now on WhatsApp. Click to Join

ఏమిటీ సీసీఎస్ ?

రూ.25 లక్షల కంటే ఎక్కువ మొత్తంతో ముడిపడి ఉన్న సొత్తు సంబంధిత నేరాలు, రూ.75 లక్షలకు మించిన మొత్తంతో కూడిన మోసాల కేసులు సీసీఎస్‌(Hyderabad CCS) పరిధిలోని వస్తాయి. ఇలాంటి వాటిపై నేరుగా సీసీఎస్ కేసులు నమోదు చేస్తుంది. నగరంలోని ఇతర పోలీసుస్టేషన్లలో నమోదైన వాటిని సిటీ పోలీసు కమిషనర్‌ దర్యాప్తు నిమిత్తం సీసీఎస్‌కు బదిలీ చేస్తుంటారు. సీసీఎస్‌ దర్యాప్తు చేసే కేసులలో ఎక్కువ భాగం రూ.కోట్లతో ముడిపడిన వ్యవహారాలే ఉంటాయి.

Also Read : AP CM Salary : ఏపీ సీఎం, తెలంగాణ సీఎం వేతనాలు ఎంతో తెలుసా ?

ఆ అంశాన్ని ఆసరాగా చేసుకొని దోపిడీ

వాస్తవానికి చట్టం ప్రకారం.. సివిల్ వివాదాల్లోకి పోలీసులు తలదూర్చకూడదు. క్రిమినల్ కేసులు మాత్రమే నమోదు చేసుకుని దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఈ అంశం కూడా సీసీఎస్ అధికారులకు కలిసి వస్తోంది. సీసీఎస్‌లో నమోదయ్యే, ఫిర్యాదులుగా వచ్చే ఆర్థిక నేరాల్లో చాలా వాటిని సివిల్, క్రిమినల్ అని విడదీయడానికి మధ్యలో చాలా చిన్న సాంకేతిక గీత మాత్రమే ఉంటుంది. ఇది కూడా కొందరు అవినీతి అధికారులకు కలిసి వస్తోంది. సివిల్ కేసును క్రిమినల్‌గా మార్చి అరెస్టు చేస్తానంటూ నిందితుల నుంచి, క్రిమినల్ కేసులు అయినప్పటికీ సివిల్‌గా తేలుస్తానంటూ బెదిరించి ఫిర్యాదుదారుల నుంచి అందినకాడికి దండుకుంటున్న దాఖలాలు ఉన్నాయని అంటున్నారు.

Exit mobile version