Site icon HashtagU Telugu

Book Festival : పుస్తకం పిలుస్తోంది.. పోదాం పదా!

Book Fair

Book Fair

‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కో… కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో’ అన్నారు కందుకూరి వీరేశలింగం. ఒక్క పుస్తకం తోడుంటే.. వందమంది స్నేహితులతో సరిసమానం. పుస్తకం విలువ ఎంటో తెలుసు కాబట్టే గొప్పవాళ్లు తరచుగా ఇలాంటి మాటలు చెప్తుంటారు. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్నా.. ఈబుక్స్ వినియోగం పెరిగినా.. పుస్తక పఠనం ఏమాత్రం తగ్గలేదని చెప్పక తప్పదు. పుస్తకం కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. కొత్త విషయాలను నేర్పిస్తోంది. జీవన విధానమూ తెలియజేస్తుంది. నేటి కాలంలోనూ పిల్లల నుంచి పెద్దల వరకూ పుస్తకాల కోసం పరుగులు తీస్తున్నారు. తమకు నచ్చిన మూవీ చూసి ఇతరులకు సినిమా గొప్పతనం ఎలా చెప్తున్నారో.. అలాగే మార్కెట్లోకి కొత్త పుస్తకం వస్తే.. చదివేసి పుస్తక సమీక్షలు రాస్తూ ఇతరులతో తమ ఆలోచనలను పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ కొత్త పుస్తకాలు దొరికితే.. అక్కడ పుస్తక ప్రేమికులు వాలిపోతుంటారు. కథలు, సాహిత్య, ఫిక్షన్, జీవితచరిత్రల పుస్తకాల కోసం అన్వేశించే బుక్స్ లవర్స్ కోసం త్వరలోనే బుక్ ఫెయిర్ ప్రారంభంకానుంది.

ఎప్పుడు మొదలవుతుంది?

ఈ నెల 18 నుంచి 27 వరకు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో బుక్ ఫెయిర్ మొదలుకానుంది. కరోనా కారణంగా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. మాస్కులు ధరించడం, శానిటైజ్ చేసుకోవడం లాంటి జాగ్రత్తలు పాటించాలి.

ఏయే పుస్తకాలు

చిన్న పిల్లల ఇష్టపడే కామిక్ కథల నుంచి పెద్ద ఇష్టపడే లిటరేచర్ పుస్తకాల వరకు బుక్ ఫెయిర్ లో అందుబాటులో ఉంటాయి. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పుస్తకాలు సైతం బుక్ ఫెయిర్ లో దొరకుతాయి. ప్రతి యేటా కొత్త రచయితలు పుట్టుకువస్తూనే ఉంటారు. ఈ సారి కూడా కొత్త రచనలు బుక్ ఫెయిర్ వేదికగా విడుదల కానున్నాయి.

టైమింగ్స్

మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు బుక్ ఫెయిర్ ఉంటుంది. శని, ఆదివారాల్లో అదనంగా ఒక గంట సేపు కొనసాగుతుంది.

Exit mobile version