HGCC : ఇక ‘హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్‌’.. ఎందుకు ?

  • Written By:
  • Updated On - March 2, 2024 / 11:36 AM IST

HGCC : తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేసేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు చేస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలోని ప్రాంతాలన్నీ కలిపి ఒకే కార్పొరేషన్‌‌ను ఏర్పాటు చేయడం లేదా నాలుగువైపులా నాలుగు కార్పొరేషన్లను ఏర్పాటు చేసే ప్రతిపాదనలను తెలంగాణ సర్కారు  పరిశీలిస్తోంది.

We’re now on WhatsApp. Click to Join

ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేష‌న్‌తో పాటు 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్‌గా(HGCC) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని అంటున్నారు. ఒకవేళ అది సాధ్యంకాకపోతే.. నాలుగువైపులా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ పేరిట నాలుగు కార్పొరేషన్లు ఏర్పాటు చేసే ప్రతిపాదనలు కూడా ప్రభుత్వం ఎదుట ఉన్నాయి.

Also Read : 335 PA Posts : డిగ్రీ అర్హతతో ఈపీఎఫ్​ఓ‌లో 335 పీఏ పోస్టులు

కొత్తగా ఏర్పాటు చేసే కార్పొరేషన్ పరిధిలోని డివిజన్లను జనాభా ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని తెలుస్తోంది. అన్ని డివిజన్లలో సమానంగా జనాభా ఉండేలా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్దేశించారట. ఈవిషయంలో నియోజకవర్గాల సరిహద్దులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.  హైదరాబాద్ నగరం పరిధిలోని కొన్ని డివిజన్లలో లక్ష మంది చొప్పున జనాభా ఉండగా.. మరికొన్ని చోట్ల 30 వేల మందే ఉన్నారు. ఈ నేపథ్యంలో మౌలిక వసతుల ఏర్పాటుకు అన్ని డివిజన్లకు ఒకే తీరుగా నిధులు కేటాయిస్తే.. జనాభా ఎక్కువగా ఉన్న డివిజన్లు నష్టపోతున్నాయని రాష్ట్ర సర్కారు భావిస్తోంది. అందుకే సమానంగా జనాభా ఉండేలా డివిజన్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.

Also Read :TBJP: బీఆర్ఎస్ కు మరో షాక్.. బీజేపీలోకి మరో ఎంపీ

గ్రేటర్ హైదరాబాద్ సిటీని ఒకేతీరుగా అభివృద్ధి చేసేందుకు ఈ విలీనం ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పాలకవర్గాల పదవీకాలం పూర్తైన వెంటనే వాటికి ప్రత్యే క అధికారులను నియమించనున్నారు.  ఆ తర్వాతే విలీన ప్రక్రియపై ముందుకు వెళ్లనున్నారు. ఢిల్లీలో గతంలో మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఉండేవి. అయితే వాటిని ఒకే కార్పొరేషన్‌గా రెండేళ్ల కిందట విలీనం చేశారు. ఆ విధానాన్నే ఇక్కడ కూడా అనుసరించేందుకు ప్రభుత్వం అధికారులతో సమాలోచనలు చేస్తోంది.