Site icon HashtagU Telugu

Hyderabad: వరదలు లేని నగరంగా హైదరాబాద్: సీఎం రేవంత్

Hyderabad

Hyderabad

Hyderabad: సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని హైదరాబాద్‌ (Hyderabad)లో నిర్వహించడం సంతోషంగా ఉంద‌న్నారు. తెలంగాణ ఏర్పడి దశాబ్దం గడుస్తోంది.. తెలంగాణ అభివృద్ధికి సంబంధించి మాకో కల ఉంది అదే తెలంగాణ రైజింగ్ అని సీఎం తెలిపారు. హైదరాబాద్‌లో ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించుకున్నామ‌న్నారు. న్యూయర్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ వంటి నగరాలతో ఫ్యూచర్ సిటీ పోటీ పడుతుందని వెల్ల‌డించారు.

భారతదేశంలోనే  గొప్ప నగరాన్ని నిర్మించాలని అనుకుంటున్నామ‌ని, ఇందులో సేవా రంగం మాత్రమే ఉంటుందని తెలిపారు. ఫ్యూచర్ సిటీ  కాలుష్య రహిత నెట్ జీరో సిటీగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు. 3,200 ఈవీ బస్సులను ఆర్టీసీలోకి తీసుకువస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్, రోడ్డు పన్నును  తొలగించిన‌ట్లు గుర్తుచేశారు. భారతదేశంలోనే ఎలక్ట్రిక్ వాహనాలు అత్యంత వేగంగా అమ్ముడవుతున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.

Also Read: Congress vs Regional Parties : ‘ఇండియా’లో విభేదాలు.. ఆధిపత్యం కోసం కాంగ్రెస్‌తో ప్రాంతీయ పార్టీల ఢీ

సీఎం ఇంకా మాట్లాడుతూ.. ప్రకృతి విపత్తులను ఎదుర్కొవడానికి హైదరాబాద్ సిద్ధమౌతోంది. వరదలు లేని నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలనుకుంటున్నాం. మూసీ పునరుజ్జీవనంతో 55 కిలో మీటర్ల వరకు మంచినీటితో ప్రవహించేలా చేయనున్నాం. 2050 సంవత్సరానికి అవసరమయ్యే  తాగు నీటి అవసరాలకు కావాల్సిన కార్యచరణను ఇప్పటి నుంచే ప్రారంభించాం. రీజినల్ రింగ్ రోడ్ ప్రణాళికల దశలో ఉంది. స్కిల్స్, ఉద్యోగాల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించాం. ప్రపంచంలో హైదరాబాద్‌ను చైనాకు ప్లస్ సిటీ గా మార్చే వ్యూహంతో ముందుకు వెళ్తున్నాం. ఔట‌ర్‌ రింగ్ రోడ్ బయట ఉన్న  గ్రామీణ తెలంగాణలో వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, కోల్డ్ స్టోరేజీలు, గిడ్డంగులపైన దృష్టి పెడతాం. తెలంగాణ కు తీరప్రాంతం లేదు. అందుకే ఇక్కడ డ్రై పోర్ట్ ఏర్పాటు చేయనున్నాం. ఏపీలోని బందర్ ఓడరేవుతో అనుసంధానం చేస్తూ ప్రత్యేక రహదారితో పాటు రైల్వే కనెక్షన్ ఏర్పాటు చేయబోతున్నాం. మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందాలని, మార్కెట్లు స్వేచ్ఛగా పనిచేయాలని మేము కోరుకుంటున్నాము. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మాతో కలిసి రండి. రండి.. కలిసి అద్భుతాలు సృష్టిద్దాం. భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అత్యున్నత వ్యాపార సౌలభ్యాన్ని నేను మీకు అందిస్తాను అని సీఎం వివ‌రించారు.