ఇవేం ఎన్నికలు బాబోయ్.. లబోదిబోమంటున్న ఓటర్లు!

  • Written By:
  • Updated On - November 6, 2021 / 12:22 PM IST

క‌రీంన‌గ‌ర్ – హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో అభ్య‌ర్థులు ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేస్తున్నారు. పోటా పోటీగా అభ్య‌ర్థులు త‌మ ఆఖ‌రి అస్త్రాల‌ను సిద్దం చేసుకుంటున్నారు.  ప్రచారానికి కేవలం ఐదు రోజులే  ఉండటంతో పార్టీ అధినేత‌లు సైతం ప్ర‌చారంలో పాల్గొంటున్నారు. మ‌రోవైపు టీఆర్ఎస్ నేత‌లు మాత్రం బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు గుప్పిస్తున్నారు. ఈట‌ల రాజేంద‌ర్ టీఆర్ఎస్, బీజేపీ ఉమ్మ‌డి అభ్య‌ర్థి అంటూ మంత్రి కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈట‌ల రాజేంద‌ర్‌, రేవంత్‌రెడ్డి గోల్కొండ హోట‌ల్‌లో కలిశార‌ని..త‌మ ద‌గ్గ‌ర పూర్తి ఆధారాలున్నాయ‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇలా రాజ‌కీయ నాయ‌కులు ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు చేసుకుంటుంటే హ‌జురాబాద్ ఓట‌ర్లు మాత్రం మ‌రో వింత స‌మ‌స్య ఎదుర్కొంటున్నార‌ట‌….!

గ‌త ఐదు నెల‌లుగా హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గ వాసులు వింత సమ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. ఓట‌ర్లను ఒక‌టికి ప‌దిసార్లు ఆయా అభ్యర్థుల అనుచ‌రులు క‌లుస్తూ…త‌మ అభ్య‌ర్థికే ఓటు వేయాల‌ని కోరుతున్నారు. ప్రతి రోజూ కనీసం 10 నుంచి 12 గ్రూపుల వ్య‌క్తులు ఓట‌ర్ల ఇంటి త‌లుపులు త‌డుతూ ఓట్లు అడుగుతున్నారు. ఒక గ్రూపు వెళ్లిన త‌రువాత అదే అభ్య‌ర్థి త‌రుపున‌ మ‌రో గ్రూప్ వ‌చ్చి ఓట్లు అడుగుతున్నారు. ఓట‌ర్ల‌కు మొద‌ట్లో ఇది బాగానే ఉన్న ఐదు నెల‌లుగా పొద్దున నుండి రాత్రి వ‌ర‌కు త‌మ త‌లుపులు త‌డుతుండ‌టంతో వారికి త‌ల‌నొప్పిగా మారింది. దీని నుంచి త‌ప్పించుకునేందుకు ఓట‌ర్లు త‌మ ఇంటి ముందు త‌లుపుల‌కు తాళాలు వేసి త‌మ ఇంటి వెనుక ద్వారాల‌ను ఉప‌యోగిస్తున్నార‌ట‌..! ఇటీవల, టిఆర్ఎస్ కార్యకర్తలు ఓట్లు అడిగేందుకు ఓ ఇంటికి వెళ్లారు…కుటుంబ పెద్ద స్నానం చేస్తున్న విషయాన్ని పట్టించుకోకుండా, అతనిని చుట్టుముట్టి, కరపత్రాలను పంపిణీ చేశారు.

తెల్ల‌వారుజామునే వ్య‌వ‌సాయ ప‌నుల‌కు వెళ్లే వారికి ఈ గండం త‌ప్ప‌డం లేదు. వ్య‌వ‌సాయ ప‌నుల్లో బీజీగా ఉన్న రైతుల ద‌గ్గ‌ర‌కు నేరుగా వెళ్లి త‌మ అభ్య‌ర్థికి ఓట్లు వేయాల‌ని అడుగుతున్నారు. చిరు వ్యాపారుల ద‌గ్గ‌ర‌కు గుంపులు గుంపులుగా రావడంతో వారి వారి కూడా విసిగిపోతున్నారు.కొనుగోలుదారులు కంటే ఓట్లు అడిగేవారే ఎక్కువ వ‌స్తున్నార‌ని చిరు వ్యాపారులు వాపోతున్నారు. మ‌రికొంత‌మంది పార్టీ నేత‌లైతే నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న ఫోన్ నెంబ‌ర్‌ల‌కు ఫోన్ కాల్స్, వాట్స‌ప్ సందేశాల‌ను పంపుతున్నారు. దీంతో విసిగిపోయిన కొంత‌మంది ఆ నెంబ‌ర్ల‌ను బ్లాక్ చేశార‌ట‌.