Congress: రేవంత్ క్రేజ్ గ‌ల్లంతు.. హుజురాబాద్ లో అడ్రస్ లేని కాంగ్రెస్!

హుజురాబాద్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోవ‌డానికి కార‌ణం ఏంటి? పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యూహమా? చేత‌గానిత‌న‌మా?

  • Written By:
  • Updated On - November 2, 2021 / 11:54 PM IST

హుజురాబాద్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోవ‌డానికి కార‌ణం ఏంటి? పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యూహమా? చేత‌గానిత‌న‌మా? 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 60వేల ఓట్ల‌కు పైగా సాధించిన‌ కాంగ్రెస్ ఇప్పుడు రెండు వేల ద‌రిదాపుల‌కు కూడా రాక‌పోవ‌డం వెనుక ర‌హ‌స్యమేంటి? నిజంగా బీజేపీ, కాంగ్రెస్ క‌లిసి ప‌నిచేశాయా? ఒక వేళ అదే నిజ‌మ‌ని అనుకుంటే ఈటెల మోజార్టీ గొప్ప‌గా ఏమీలేదు క‌దా అనే వాళ్లు ఉన్నారు. హుజురాబాద్ లో కాంగ్రెస్ ఉనికి కోల్పోవ‌డం వెనుక అస‌లేం జ‌రిగింది?..ఇదే, ఉప ‌ఫ‌లితంలోని బ‌ర్నింగ్ టాపిక్. నువ్వా? నేనా? అన్న‌ట్టు చివ‌రి రౌండ్ వ‌రకు బీజేపీ, టీఆర్ఎస్ అభ్య‌ర్థులు పోటీ ప‌డ్డారు. తీవ్ర ఉత్కంఠ న‌డుమ సాగిన లెక్కింపు ఆద్యంత‌మూ కాంగ్రెస్ పార్టీ ఉనికి ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఒక బ‌క‌రాగా డాక్ట‌ర్ బ‌ల్మూరి వెంక‌ట్ ను కాంగ్రెస్ పెద్ద‌లు నిల‌బెట్టారు. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి, ఆయ‌న సోద‌రిగా సీత‌క్క , వీహెచ్, భ‌ట్టీ, జ‌గ్గారెడ్డి, జీవన్ రెడ్డి త‌దితర పేరుమోసిన కాంగ్రెస్ లీడ‌ర్లు ప్ర‌చారం చేశారు. మాజీ డిప్యూటీ సీఎం దామోద‌ర రాజ‌న‌ర్సింహ ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక క‌మిటీని ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రాక‌మునుపే వేశారు. అభ్య‌ర్థిని ఖ‌రారు చేయ‌డానికి ఆ క‌మిటీ క‌స‌ర‌త్తు చేసింది. చివ‌ర‌కు రేవంత్ రెడ్డి మార్క్ గా బ‌ల్మూరిని బ‌రిలోకి దింపారు. కేవ‌లం ఎన్నిక‌ల‌కు రెండు వారాల ముందు మాత్ర‌మే అభ్య‌ర్థిని కాంగ్రెస్ ఖ‌రారు చేసింది. అక్క‌డే కాంగ్రెస్ పార్టీ తొలి ఓట‌మి కనిపించింది.

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన వెంట‌నే హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల వ్య‌వ‌హారం చూడాల‌ని సీనియ‌ర్లు సూచించారు. కానీ, అటువైపు రేవంత్ వెళ్ల‌డానికి సాహ‌సం చేయ‌లేదు. ద‌ళిత‌, గిరిజ‌న దండోరాల పేరుతో తెలంగాణ అంత‌టా హ‌డావుడి చేశాడు. నిరుద్యోగ పోరు, జంగ్‌సైర‌న్ అంటూ రేవంత్ చేసిన హ‌ల్‌చ‌ల్ అంతా ఇంతా కాదు. ఇదంతా చూసిన వాళ్లు ఇక తెలంగాణ‌లో కాంగ్రెస్ కు తిరుగు ఉండ‌ద‌ని సంబ‌ర‌ప‌డ్డారు. తీరా, హుజురాబాద్ ఫ‌లితాలు చూసిన త‌రువాత వాపును చూసి బ‌లుపు అనుకున్నార‌ని అర్థం అవుతోంది. క‌నీసం గౌర‌ప్ర‌ద‌మైన ఓట్ల‌ను కూడా పొంద‌లేని దుస్థితికి కాంగ్రెస్ వెళ్లింది.

పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి చేస్తోన్న హ‌డావుడి ఆయ‌న వ్య‌క్తిగ‌త ప్రాప‌కం కోస‌మ‌ని చాలా సంద‌ర్భాల్లో కాంగ్రెస్ సీనియ‌ర్లు జ‌గ్గారెడ్డి, కోమ‌టిరెడ్డి, వీహెచ్ లాంటి వాళ్లు విమ‌ర్శించారు. పార్టీని బ‌లోపేతం చేయ‌డం కంటే రేవంత్ వ్య‌క్తిగ‌త ఇమేజ్ ను పెంచుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని ఏఐసీసీకి కూడా ప‌లుమార్లు ఫిర్యాదు చేశారు. అంతేకాదు, రేవంత్ వ్య‌క్తిగ‌త ఆస్తులు, ఆయ‌న‌పైన ఉన్న కేసులు, దందాలు, అక్ర‌మాల‌ను క్రోడీక‌రించి ఢిల్లీ అధిష్టానంకు చేర‌వేశారు. కాంగ్రెస్ పార్టీకి స‌రైన సార‌థి కాదంటూ మొర‌పెట్టుకున్నారు. హుజురాబాద్ ఎన్నిక‌ల‌ను ప‌ట్టించుకోవ‌డంలేద‌ని ఏఐసీసీకి కొంద‌రు వేగులు చేర‌వేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల గురించి గాంధీభ‌వ‌న్ స‌మావేశాల్లో ప‌‌లుమార్లు రేవంత్ ను కాంగ్రెస్ పెద్ద‌లు అప్ర‌మ‌త్తం చేశారు. కానీ, ఆయ‌న స్టైల్ కు భిన్నంగా నిమ్మ‌కుండి పోయాడు. వ్యూహాత్మ‌కంగా హుజురాబాద్ ఎన్నిక‌ల్లో రేవంత్ చ‌క్రం తిప్పుతాడ‌ని పలు సోష‌ల్ మీడియా సైట్లు ఊద‌ర‌గొట్టాయి. సీన్ క‌ట్ చేస్తే…డిపాజిట్లే కాదు, కాంగ్రెస్ పార్టీ గ‌ల్లంతు అయింది. అనూహ్యంగా రేవంత్ కు అండ‌గా కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి తెర‌మీద‌కు వ‌చ్చాడు. బీజేపీకి మ‌ద్ధ‌తు ఇచ్చినందు వ‌ల్లే కాంగ్రెస్ పార్టీకి 2వేల ఓట్లు కూడా రాలేద‌ని స‌మ‌ర్థించుకోవ‌డం కొస‌మెరుపు. సో..కోమ‌టిరెడ్డి మాదిరిగా మిగిలిన కాంగ్రెస్ పెద్ద‌లు హుజురాబాద్ ఫ‌లితాల‌పై స‌‌న్నాయినొక్కులు నొక్కుతారా? లేక రేవంత్ పై యుద్ధాన్ని ప్ర‌క‌టిస్తారా? చూద్దాం.!