నా దారి ‘హుజురాబాద్’ రహదారి.. వేడెక్కిన క్యాంపెనింగ్!

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువైన హుజూరాబాద్ ఉప ఎన్నిక నేడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. నా దారి రహదారి అంటూ గల్లీ నుంచి స్టేట్ లీడర్ల వరకు హుజూరాబాద్ లోనే మాకాం వేస్తున్నారు.

  • Written By:
  • Updated On - October 26, 2021 / 11:54 AM IST

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర బిందువైన హుజూరాబాద్ ఉప ఎన్నిక నేడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. నా దారి రహదారి అంటూ గల్లీ నుంచి స్టేట్ లీడర్ల వరకు హుజూరాబాద్ లోనే మాకాం వేస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ… ప్రధాన పార్టీల నేతలంతా సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారాన్ని మరింత వేడెక్కిస్తున్నారు. ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడటంతో ముఖ్యనాయకులంతా హుజూరాబాద్ లో వాలిపోతున్నారు. ఈటల వర్గం ఇప్పటికే పాదయాత్రలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తే, ట్రబుల్ షూటర్ హరీశ్ రావు వరుసగా సభలు సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. రేపోమాపో కేసీఆర్ సైతం హుజూరాబాద్ లో అడుగు పెట్టనున్నారు. ఇక ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి నేటితో రోడ్ షోలకు శ్రీకారం చుట్టారు. ఆయన బల్మూర్ వెంకట్ తరపున ప్రచారం చేయనున్నారు.

ప్రధాన రాజకీయ పార్టీల స్టార్‌ క్యాంపెయినర్లు హుజూరాబాద్ పరిధిలోని ఐదు మండలాల్లోని వివిధ గ్రామాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రచారానికి కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున, వివిధ పార్టీల అభ్యర్థులు హుజూరాబాద్ మొత్తం రోడ్‌షోలు నిర్వహిస్తూ ఓటర్లను కలుసుకుంటున్నారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి బల్మూర్ వెంకట్  ఉదయం 7 గంటలకు ప్రచార హోరును మొదలుపెడుతున్నారు. ముఖ్యంగా యువకులను కలుసుకుంటూ తనను గెలిపించాలని కోరుకుంటున్నారు. “యూత్ నా మతం, నిరుద్యోగాన్ని తుడిచివేయడమే నా లక్ష్యం, నాకు అవకాశం ఇవ్వండి” అని తన రోడ్‌షోలో విజ్ఞప్తి చేస్తున్నారు. నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం భూజునూరు, రాచపల్లి, మల్లన్నపల్లి, వంతడుపుల గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేయడం విశేషం.

నియోజకవర్గంలోని ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్‌ నాయకులు వి.హనుమంతరావు, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డిలు కూడా రోడ్‌షో నిర్వహించారు. తొలిసారిగా ఉప ఎన్నికల ప్రచారంలో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డితో పాటు, నిజ్మాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు డి. అరుణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించి ఈటల గెలుపు కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు.

ఇక టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు ఓటు వేయాలని మంత్రులు టి.హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, మాజీ ఎంపీ వినోద్‌రావు, టీఆర్‌ఎస్‌ నాయకుడు పి.కౌశిక్‌రెడ్డి హుజూరాబాద్ మొత్తం తిరుగుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ నాయకులు నువ్వానేనా అన్నట్టు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ ఉప ఎన్నికను కేసీఆర్ అహంకారానికి, హుజురాబాద్ ఓటర్ల అహంకారం మధ్య పోటీ జరుగుతుందని తేల్చియగా, కేసీఆర్ భిక్షతో పదవులు అనుభవించిన ఈటల పార్టీకే వెన్నుపోటు పొడిచారని టీఆర్ఎస్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఉప ఎన్నిక ఫలితాలు వస్తేకానీ హుజురాబాద్ కింగ్ ఎవరో అనేది మాత్రం చెప్పడం చాలా కష్టంమని భావించవచ్చు.