సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్)లో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అనారోగ్య సమస్యలతో సీఎంఆర్‌ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్న బాధితుల వివరాలను మార్చి, ఆ డబ్బులను తమ సొంత ఖాతాల్లోకి మళ్లించిన ఒక ముఠా గుట్టు రట్టయింది. గత ప్రభుత్వ హయాంలో కోదాడలో పనిచేసిన ఒక మాజీ ప్రజాప్రతినిధి కింద పనిచేసిన వ్యక్తులు ఈ ముఠాగా ఏర్పడి 2020-21 నుండి ఈ దందాకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దరఖాస్తు చేసుకున్నవారికి మంజూరైన చెక్కులు ప్రజాప్రతినిధి కార్యాలయానికి చేరుకున్న తర్వాత, వాటిని పంపిణీ చేస్తామని చెప్పి ముఠా సభ్యులు తీసుకునేవారు. ఆ తరువాత బాధితుల ఇంటిపేరుకు దగ్గరగా ఉన్న వేరే వ్యక్తుల బ్యాంక్ ఖాతాలకు డబ్బులను బదిలీ చేసి కాజేసేవారు. ఈ కుంభకోణంలో సచివాలయంలో గతంలో పనిచేసిన ఒక ఉద్యోగి కూడా ముఠాకు సహకరించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ మోసం వెలుగులోకి రావడానికి ఒక ఘటన ప్రధాన కారణం. నడిగూడెంకు చెందిన గద్దె వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి 2022లో గుండె ఆపరేషన్ జరిగింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆయన సీఎంఆర్‌ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2023లో ఆయనకు లక్షన్నర రూపాయలు మంజూరైనా, చెక్కు ఆయనకు చేరలేదు. ఈ ముఠా ఆయన బ్యాంక్ ఖాతా వివరాలను మార్చి, గడ్డం వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఖాతాలోకి డబ్బులు బదిలీ చేసి డ్రా చేసుకున్నారు. దాదాపు ఏడాదిన్నరగా డబ్బులు రాకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు అధికారులను సంప్రదించగా, అసలు విషయం బయటపడింది. తనకు రావాల్సిన డబ్బులు మరొకరి ఖాతాలోకి బదిలీ అయ్యాయని తెలిసి వెంకటేశ్వరరావు షాక్‌కు గురయ్యారు.
Hanumakonda : మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడించిన మధ్యాహ్న భోజన కార్మికులు
దీంతో బాధితుడు గద్దె వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ముఠా గత కొంతకాలంగా ఇలాగే పలువురి సీఎంఆర్‌ఎఫ్ నిధులను కాజేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కోదాడ నియోజకవర్గానికి చెందిన పలువురు రాజకీయ నాయకులు కలిసి ఈ ముఠాగా ఏర్పడినట్లు నిర్ధారించారు. దర్యాప్తులో భాగంగా మునగాల మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నారు.
ఈ ముఠా గత నాలుగేళ్లుగా కోట్ల రూపాయల సీఎంఆర్‌ఎఫ్ నిధులను కొట్టేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. త్వరలోనే ఈ ముఠాలోని మిగిలిన సభ్యులను కూడా పట్టుకోవడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ కుంభకోణంలో గత ప్రభుత్వంలోని కీలక నేతలకు కూడా సంబంధం ఉందని బహిరంగంగా చర్చలు జరుగుతున్నాయి. దర్యాప్తు పూర్తయితే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.