Site icon HashtagU Telugu

I Am With CBN : చంద్ర‌బాబుకు మ‌ద్ధ‌తుగా నేడు ఖ‌మ్మంలో భారీ సంఘీభావ ర్యాలీ

I Am with CBN

I Am with CBN

టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్‌పై ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక వివిధ దేశాల్లో ఉన్న తెలుగువారు బాబు అరెస్ట్‌ని ఖండిస్తున్నారు. ఐ యామ్ విత్ సీబీఎన్ అంటూ పెద్ద ఎత్తున ఆందోళ‌న నిర్వ‌హిస్తున్నారు. ఏపీలో అన్ని జిల్లాల్లో టీడీపీ నేత‌లు దీక్ష‌లు, ర్యాలీలు నిర్వ‌హిస్తున్నారు. ఇటు తెలంగాణ‌లో ఐటీ ఉద్యోగులతో పాటు చంద్ర‌బాబుని అభిమానించే ప్ర‌తి ఒక్క‌రు రోడ్డెక్కారు. గ‌చ్చిబౌలి విప్రో స‌ర్కిల్‌, సైబ‌ర్ ట‌వ‌ర్స్‌, కూక‌ట్‌ప‌ల్లి, మ‌ణికొండ‌తో పాటు నిన్న ఔట‌ర్ రింగ్ రోడ్‌పై కూడా ఐటీ ఉద్యోగులు చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా కార్ల ర్యాలీ నిర్వ‌హించారు. ఓఆర్ఆర్‌పై పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు కార్ల‌తో వ‌చ్చారు.

నేడు ఖ‌మ్మంలో కూడా చంద్ర‌బాబుకు మ‌ద్ధ‌తుగా భారీ సంఘీభావ ర్యాలీ నిర్వ‌హించనున్నారు. ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలోని ఎన్టీఆర్ స‌ర్కిల్ నుంచి పెవిలియ‌న్ గ్రౌండ్ వ‌ర‌కు ఈ ర్యాలీ జ‌ర‌గ‌నుంది. సాయంత్రం నాలుగు గంట‌ల‌కు ర్యాలీ ప్రారంభంకానుంది. ఖ‌మ్మం జిల్లా అభివృద్ధి సంక్షేమానికి నాడు చంద్ర‌బాబు ఎంతో కృషి చేశార‌ని జిల్లా వాసులు, ఆయ‌న అభిమానులు అంటున్నారు. పెద్ద సంఖ్య‌లో మ‌హిళ‌లు, యువ‌తీయువ‌కులు త‌ర‌లిరావాల‌ని అభిమానులు పిలుపునిచ్చారు. ర్యాలీ ఎలాంటి రాజకీయ జెండాలు ఉండ‌వ‌ని.. ఐయామ్ విత్ సీబీఎన్ ప్ల‌కార్డులు, న‌ల్ల‌జెండాలు మాత్ర‌మే ఉంటాయ‌ని చంద్ర‌బాబు అభిమానులు తెలిపారు.