Metro Rail : మెట్రో విస్త‌ర‌ణ‌లో భారీ `భూ` స్కామ్‌! బినామీల‌పై బీజేపీ ఆగం!

మెట్రో రైలు(Metro Rail) విడ‌త‌వారీగా నిర్మాణం చేయ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం

  • Written By:
  • Updated On - December 19, 2022 / 05:35 PM IST

మెట్రో రైలు(Metro Rail) విడ‌త‌ల వారీగా నిర్మాణం చేయ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల నిర్ణ‌యం తీసుకోవ‌డం వెనుక భూ స్కామ్(Land scam) ఉంద‌ని బీజేపీ చెబుతోంది. ప్రైవేట్ భూస్వాములకు లబ్ధి చేకూర్చేందుకే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఎయిర్‌పోర్ట్ మెట్రో రైలు(Metro Rail) మార్గాన్ని మార్చారని బిజెపి రాజ్యసభ సభ్యుడు, ఒబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ ఆరోపించారు. రాష్ట్రంలో జ‌రుగుతోన్న భూ స్కామ్(Land scam) ల‌కు అడ్డు అదుపు లేకుండా పోతుంద‌ని క‌మ‌ల‌నాథుల అభిప్రాయం. ఇప్ప‌టికే హైద‌రాబాద్ చుట్టు ప‌క్క‌ల సీఎం కేసీఆర్ అండ్ బ్యాచ్ కొన్ని వేల ఎక‌రాల ల్యాండ్ బ్యాంకును క‌లిగి ఉన్నార‌ని ఆరోప‌ణ‌లు అనేకం. వాటికి ధ‌ర‌లు పెంచుకోవ‌డానికి మెట్రో (Metro Rail) ప్రాజెక్టును విస్త‌రిస్తున్నార‌ని బీజేపీ చెబుతోంది.

ప్ర‌భుత్వం భూముల‌ను కేసీఆర్ స‌ర్కార్ త‌ర‌చూ విక్ర‌యిస్తోంది. అంతేకాదు, అసైన్డ్ భూముల‌ను ప్ర‌భుత్వ ఆధీనంలోకి తీసుకుంటుంది. ల‌బ్దిదారుల‌కు ఇవ్వ‌కుండా ప్ర‌భుత్వం కిరికిరి చేస్తోంద‌ని ల‌క్ష్మ‌ణ్ ఆరోపించారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో భూముల‌ను కేసీఆర్ బినామీలు పెద్ద ఎత్తున కొనుగోలు చేశార‌ని చాలా కాలంగా వినిపిస్తోన్న ఆరోప‌ణ‌లు. సామాన్యుల ప్రయోజ‌నాల‌ను పక్క‌న‌బెట్టి రియ‌ల్డ‌ర్లు, ఎంఐఎం కు అనుకూలంగా మెట్రో రైలు మార్గాన్ని 16 కి.మీ నుండి 32 కి.మీకి మార్చింద‌ని ల‌క్ష్మ‌ణ్ చెబుతున్నారు. మెట్రో రైలుకు 100 శాతం నిధులపై కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారని వివ‌రించారు. ఉద్యోగుల‌కు స‌కాలంలో జీతాలు ఇవ్వ‌లేని కేసీఆర్ మెట్రో విస్త‌ర‌ణ‌కు ఉప‌క్ర‌మించ‌డం వెనుక బినామీ ఆస్తుల‌ను పెంచ‌డం కోస‌మేనంటూ బీజేపీ ఆరోపిస్తోంది.

జ‌మిలి ఎన్నిక‌లు

లోక్ స‌భ , అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ఒకేసారి పెట్టాల‌ని బీజేపీ తొలి నుంచి ఆలోచిస్తోంది. దేశంలో జ‌మిలి ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌డం ద్వార ప్ర‌జాధ‌నాన్ని కాపాడాల‌ని క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు వివిధ పార్టీల నేత‌ల‌తో ప్ర‌ధాని మోడీ సంప్ర‌దింపులు జ‌రిపారు. కానీ, జ‌మ‌లి ఎన్నిక‌లు పెట్ట‌డానికి అనువైన ప‌రిస్థితులు రాలేదు. అందుకోసం బీజేపీ ప్ర‌య‌త్నం చేస్తుందని ఆ పార్టీ కేంద్ర బోర్డు మెంబ‌ర్, ఎంపీ ల‌క్ష్మ‌ణ్ అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల‌కు ఎప్పుడు అనేది ఎన్నిక‌ల క‌మిష‌న్ నిర్ణ‌యిస్తుంద‌ని ల‌క్ష్మ‌ణ్ అన్నారు. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌తో పాటు తెలంగాణ‌కు అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఉంటాయ‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇస్తూ ఎన్నిక‌ల క‌మిష‌న్ సీఎం కేసీఆర్ చేతిలో ఉండ‌ద‌న్నారు. అసెంబ్లీని ర‌ద్దు చేసే వ‌ర‌కు మాత్ర‌మే ఆయ‌న ప‌రిధిలో ఉంటుంద‌ని గుర్తు చేశారు. ఆ త‌రువాత ఎన్నిక‌ల‌ను ఎప్పుడు పెట్టాలి? అనేది కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ నిర్ణ‌యిస్తుంద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. అంటే, క‌ర్ణాట‌క‌తో పాటుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు ఉండే అవ‌కాశం లేద‌ని గ్ర‌హించొచ్చు.

డ‌బుల్ ఇంజ‌న్

డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కార్ రాష్ట్రాల‌ను బాగు చేయ‌గ‌ల‌ద‌ని బీజేపీ చెబుతోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఆ పార్టీ వినిపించే స్లోగ‌న్ డబుల్ ఇంజ‌న్ స‌ర్కార్‌. రాబోవు ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లోనూ అదే నినాదాన్ని బీజేపీ అందుకోనుంది. అందుకే, ఇప్ప‌టి నుంచే ప్ర‌జ‌ల్ని అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం కేసీఆర్ కేంద్రంతో స‌ఖ్య‌త‌గా లేక‌పోవ‌డాన్ని ల‌క్ష్మ‌ణ్ గుర్తు చేస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వంతో ఘ‌ర్ష‌ణ వైఖ‌రి మంచిది కాద‌ని హిత‌వు ప‌లికారు. ప్రొటోకాల్ ప్ర‌కారం సీఎం కేసీఆర్ న‌డుచుకోవాల‌ని సూచించారు. ఇటీవ‌ల ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా కేసీఆర్ మొఖం చాటేయ‌డం నుంచి అసెంబ్లీ స‌మావేశాల్లో ప్రారంభోప‌న్యాసం గ‌వ‌ర్న‌ర్ కు లేకుండా చేయ‌డాన్ని త‌ప్పుబ‌ట్టారు.

Also Read : Metro: మెట్రో సెకండ్ ఫేజ్‌కు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్