TPCC : తెలంగాణ పీసీసీ రాష్ట్ర కార్యవర్గం పదవులకు భారీ పోటీ నెలకొంది. ఆశావహ నేతలు పెద్దసంఖ్యలో దరఖాస్తులు సమర్పించారు. మరో మూడు నుంచి నాలుగురోజుల్లోగా వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షుల ఎంపికను పూర్తి చేసేందుకు ముమ్మర కసరత్తు జరుగుతోంది. ఆయా పదవులకు అర్హులైన వారి పేర్లను రేపో, మాపో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ (ఏఐసీసీ)కి పంపనున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్ష పదవుల కోసం అప్లై చేసిన వారిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఉన్నారు. దీంతో పోటీ ఏ రేంజులో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. 2017 నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారికే పీసీసీ రాష్ట్ర కార్యవర్గం ఎంపికలో తొలి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.
ఆచితూచి లిస్ట్ తయారీ
టీపీసీసీ కార్యవర్గం ఏర్పాటుపై ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మమహేశ్‌కుమార్‌గౌడ్ ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలకు వివరణ ఇచ్చారు. కొత్త పీసీసీ కార్యవర్గం పదవుల కోసం దాదాపు రెండు వందల మంది నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సారి లిమిటెడ్‌గా జిల్లాకు ఇద్దరు చొప్పున పార్టీ కోసం సిన్సీయర్ గా పని చేసే వారికి అవకాశం కల్పించనున్నారట. టీపీసీసీ సెక్రటరీలు, అధికార ప్రతినిధుల ఎంపిక విషయంలో కూడా ఆచితూచి లిస్ట్ తయారు చేస్తున్నట్లు సమాచారం.
Also Read : Srinagar Explosions: శ్రీనగర్ ఎయిర్‌పోర్టుపై పాక్ దాడి.. దాల్ లేక్‌లో మిస్సైల్ పేలుడు
వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు.. ఏ వర్గానికి ?
గత టీపీసీసీ కార్యవర్గంలో ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉన్నారు. ఈసారి కూడా నలుగురు లేదా ఐదుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా, 20 మందిని ప్రధాన కార్యదర్శులుగా, 25 మందిని ఉపాధ్యక్షులుగా నియమించే ఛాన్స్ ఉంది. పీసీసీ అధ్యక్షుడిగా బీసీ సామాజికవర్గానికి చెందిన మహేశ్‌కుమార్‌గౌడ్ ఉన్నందున.. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అదే వర్గానికి చెందిన వారికి అవకాశం ఇస్తారా? లేదా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులకు ఒక ఓసీ ఎంపీ, బీసీ మహిళ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం.
Also Read :Operation Sindoor Movie : ‘ఆపరేషన్ సిందూర్’ పోస్టర్.. సారీ చెప్పిన దర్శకుడు.. ఎందుకు ?
గ్రామ, మండల, జిల్లాల అధ్యక్షుల ఎంపిక విషయంలో..
కాంగ్రెస్ పార్టీ(TPCC) గ్రామ, మండల, జిల్లాల అధ్యక్షుల ఎంపికను ఈ నెలాఖరులోగా పూర్తి చేసే అవకాశం ఉంది. ఒక్కో అధ్యక్ష పదవికి ఐదుగురు నేతల పేర్లను క్షేత్రస్థాయి నేతలు సూచించనున్నారు. అయితే ఒకే సామాజిక వర్గం నుంచి రెండు పేర్లను అస్సలు పంపొద్దని నిర్దేశించారు. గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల పరిధిలో ముఖ్య కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరించి గ్రామ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఐదుగురి పేర్లను ప్రతిపాదించనున్నారు. వీరిలో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల నుంచి ఒక్కో పేరు ఉంటుంది. మండల, జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవులకూ ఇదే విధానంలో పేర్లు పంపనున్నారు.