ప్రియుడి కోసం ఎంత పని చేశావు?

నమ్మకంగా పనిచేస్తున్నాడనుకున్న వ్యక్తే యజమాని కుటుంబానికి తీరని ద్రోహం చేశాడు. ప్రేమ పేరుతో యజమాని కుమార్తెను వంచించి, ఆమె నుంచి ఏకంగా కిలో బంగారు ఆభరణాలను కాజేశాడు. బ్రెయిన్ ట్యూమర్ అంటూ నాటకమాడి ఈ భారీ మోసానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి చైతన్యపురిలో టైల్స్ వ్యాపారం చేస్తున్నాడు. ఆయన వద్ద 34 ఏళ్ల సాగర్ గత నాలుగేళ్లుగా మేనేజర్‌గా […]

Published By: HashtagU Telugu Desk
employer's daughter into stealing 100 tola gold

employer's daughter into stealing 100 tola gold

నమ్మకంగా పనిచేస్తున్నాడనుకున్న వ్యక్తే యజమాని కుటుంబానికి తీరని ద్రోహం చేశాడు. ప్రేమ పేరుతో యజమాని కుమార్తెను వంచించి, ఆమె నుంచి ఏకంగా కిలో బంగారు ఆభరణాలను కాజేశాడు. బ్రెయిన్ ట్యూమర్ అంటూ నాటకమాడి ఈ భారీ మోసానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి చైతన్యపురిలో టైల్స్ వ్యాపారం చేస్తున్నాడు. ఆయన వద్ద 34 ఏళ్ల సాగర్ గత నాలుగేళ్లుగా మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. నమ్మకంగా ఉంటూ యజమాని కుటుంబంతో కలిసిపోయాడు. ఈ క్రమంలోనే యజమాని కుమార్తెతో పరిచయం పెంచుకుని, ఆమెను ప్రేమ పేరుతో తనవైపు తిప్పుకున్నాడు. సాగర్‌కు అప్పటికే పెళ్లయ్యి ఒక పాప కూడా ఉండటం, ఇంట్లో ఒకడిలా చూసుకుంటుండటంతో యజమానికి అతడి ప్రవర్తన పట్ల అనుమానం రాలేదు.

కొంతకాలం తర్వాత తన పథకాన్ని అమలు చేయడం మొదలుపెట్టాడు. తనకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానంటూ ఆమె ముందు కన్నీటిపర్యంతమయ్యాడు. అతని మాటలను పూర్తిగా నమ్మిన ఆ యువతి, ప్రియుడిని కాపాడుకోవాలని నిర్ణయించుకుంది. ఇంట్లో ఎవరికీ తెలియకుండా లాకర్‌లో ఉన్న కిలో బంగారు ఆభరణాలను తీసుకెళ్లి అతనికి ఇచ్చింది.

ఆ బంగారంలో కొంత అమ్మి అప్పులు తీర్చుకున్న సాగర్, మిగిలిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడపడం ప్రారంభించాడు. ఖరీదైన దుస్తులు, వస్తువులు కొంటూ తన జీవనశైలిని మార్చుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ నెల 17న వ్యాపారి కుటుంబం తమ సొంతూరు వెళ్లేందుకు సిద్ధమవుతూ లాకర్‌ను పరిశీలించగా, కిలో బంగారం కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యారు. వెంటనే చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు, కుటుంబ సభ్యులను విచారించగా, కుమార్తె ప్రవర్తనపై అనుమానం వచ్చింది. ఆమెను లోతుగా ప్రశ్నించడంతో అసలు విషయం వెల్లడించింది. ఆమె ఇచ్చిన సమాచారంతో పోలీసులు నిందితుడు సాగర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 20 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకుని, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

  Last Updated: 22 Apr 2026, 11:15 AM IST