Site icon HashtagU Telugu

Komati Reddy: అడగకుండా కేంద్ర నిధులు ఎలా ఇస్తుంది: కోమటిరెడ్డి

How Central Funds Are Given Without Asking.. Komati Reddy

How Central Funds Are Given Without Asking.. Komati Reddy

Komati Reddy : ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. సికింద్రాబాద్ – తిరుపతి మధ్య నడిచే వందే భారత్ రైలు మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు మోదీ ఇవాళ నగరానికి వచ్చారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి తన ప్రోటోకాల్ ప్రకారం స్వయంగా వెళ్లి ఆహ్వానించాల్సి ఉంది. బేగంపేటలో ప్రధాని మోదీని రిసీవ్ చేసుకోవడంలో సీఎం కేసీఆర్ గైర్హాజయ్యారు. దాంతో మంత్రి తలసాని శ్రీనివాస్, గవర్నర్ తమిళి సై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ప్రధాని మోదీని స్వాగతించారు.

ముఖ్యమంత్రి వెళ్లకుండా ఒక మంత్రిని పంపించడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అదీకాకుండా మోదీ సభలో ముఖ్యమంత్రి మాట్లాడటానికి 7 నిమిషాల సమయాన్ని కూడా కేటాయించారు. ఇదే విషయాన్నీ ప్రతిపక్షాలు ఎత్తిచూపుతున్నాయి. ప్రధాని సభలో సీఎం 7 నిమిషాల్లో 70 విషయాలపై మాట్లాడొచ్చని అభిప్రాయపడ్డారు నల్గొండ జిల్లా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి.

ప్రధాని పర్యటన అనంతరం మీడియా సమావేశంలో కోమటిరెడ్డి (Komati Reddy) మాట్లాడారు. అడగంది అమ్మ అయినా అన్నం పెట్టదు. మరి అడగకుండా కేంద్రం నిధులు ఎలా ఇస్తుంది?, రాష్ట్ర సమస్యలు కేంద్రం ముందు ఉంచితేనే కదా తెలిసేది. ప్రధాని సభలో 7 నిమిషాలు కేటాయించారు. ఆ సమయంలో రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన ఎన్నో సమస్యలపై మాట్లాడవచ్చు. ఎన్ని కొట్లాటలున్నా… ఎన్ని విభేదాలున్నా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అవన్నీ పక్కనపెట్టాలని హితవు పలికారు.

కేంద్రంతో సఖ్యత లేకపోయినా ఎయిర్పోర్ట్ కి వెళ్లి ప్రధానిని ఆహ్వానించి సమస్యలు చెప్పాలి. పక్క రాష్ట్ర సీఎంలు కేంద్రంతో ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ ప్రధానిని కలవడం లేదా?, వారి సమస్యలు మోడీకి వివరించట్లేదా అని సీఎం కెసిఆర్ తీరుని ప్రశ్నించారు కోమటిరెడ్డి. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్ ఎన్నో సార్లు ప్రధానిని కలిసి రాష్ట్ర సమస్యలు చెప్పుకున్నారని గుర్తు చేశారు. నేను కూడా ప్రధానిని పలుమార్లు కలిసి నా నియోజకవర్గానికి కావాల్సిన నిధులు తెచ్చుకున్నానని చెప్పారు ఎంపీ కోమటిరెడ్డి.

ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు.. రూ.714 కోట్లతో సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్ధాపన చేశారు. హైదరాబాద్-మహబూబ్‌నగర్ డబ్లింగ్ పనులను ప్రారంభించిన అనంతరం ఐదు జాతీయ రహదారుల పనులకు శంకుస్థాపన చేశారు. రిమోట్ ద్వారా శిలాఫలకాలను మోదీ ఆవిష్కరించారు.

విశేషం ఏంటంటే శిలాఫలకాల మీద ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ పేరును ప్రస్తావించారు. అలాగే మేడ్చల్ నుండి ఎంఎంటీఎస్ సర్వీసులను నూతనంగా ప్రారంభించారు. దీంతోపాటు 1,366 కోట్లతో నిర్మించనున్న బీబీ నగర్ ఎయిమ్స్ కొత్త భవనానికి శంకుస్ధాపన చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.

Also Read:  COVID Cases : దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. అలెర్ట్ చేసిన కేంద్రం..