హైదరాబాద్ (Hyderabad) లో ఇంటి అద్దెలు (House rents) చూసి నగరవాసులు లబోదిబోమంటున్నారు. బ్రతుకుదెరువు కోసం పల్లెను వదిలి సిటీకి వచ్చిన జనాలు..ఇక్కడ అద్దెలకు తమ చేసిన కష్టం అంత పోతుందని వాపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు ఉన్నా, భారత్‌లో వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగం విస్తృతంగా అభివృద్ధి చెందుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం ఈ వృద్ధిలో ప్రాధాన్యతగల స్థానాన్ని దక్కించుకుంది. అనరాక్ సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, 2022లో చదరపు అడుగుకు రూ. 59గా ఉన్న కార్యాలయ స్థల అద్దె 2025 నాటికి రూ. 72కి చేరుకుంది. అంటే ఇది 24.1 శాతం వృద్ధిని చూపుతోంది. ఈ గణాంకాలు నగరం ఆర్థిక మరియు సాంకేతికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నదాని సంకేతంగా నిలిచాయి.
దేశవ్యాప్తంగా అద్దెల పెరుగుదల ట్రెండ్
ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR) దేశంలో అత్యధికంగా అద్దెల పెరుగుదల నమోదు చేసింది. 2022లో చదరపు అడుగుకు రూ. 131గా ఉన్న అద్దె 2025 నాటికి రూ. 168కు చేరింది. ఢిల్లీ NCR, బెంగళూరు వంటి నగరాల్లోనూ గణనీయమైన వృద్ధి కనిపించింది. నోయిడా, గురుగ్రామ్, వైట్‌ఫీల్డ్, ఎలక్ట్రానిక్ సిటీ ప్రాంతాల్లో అంతర్జాతీయ సంస్థలు అధికంగా స్థిరపడుతున్నాయి. అయితే పుణె, చెన్నై నగరాల్లో అద్దె పెరుగుదల కాస్త మందగమైంది.
వృద్ధికి దోహదపడిన కీలక అంశాలు
ఈ పెరుగుదలకు గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (GCCs) విస్తరణ ప్రధాన కారణంగా మారింది. 2025 తొలి త్రైమాసికంలో GCCలు 8.35 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. అమెరికా ఆధారిత కంపెనీలు భారత కార్యాలయ లీజింగ్‌లో 45 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ముంబైలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ రంగాల్లో (BFSI) US కంపెనీల లీజింగ్ ప్రాభల్యం 48 శాతానికి చేరింది. ఈ విధంగా హైదరాబాద్ సహా టాప్ 7 నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం బలపడుతోంది.