BJP Leaders : బీజేపీ నేతల హౌస్ అరెస్ట్

తెలంగాణ బీజేపీ నేతలు (BJP Leaders) తలపెట్టిన బాటసింగారంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది.

Telangana BJP leaders House arrest : తెలంగాణ బీజేపీ నేతలు తలపెట్టిన బాటసింగారంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇప్పటికే ఈటల రాజేందర్, డీకే అరుణ, రాంచంద్ర‌రావు, రాణి రుద్ర‌మ‌ తదితర బీజేపీ నేతలను (BJP Leaders) పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్కడి నుంచి నేరుగా బాటసింగారానికి బయల్దేరారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే రఘునందన్ రావు, పెద్ద సంఖ్యలో బీజేపీ (BJP) శ్రేణులు ఉన్నారు. అయితే వారి వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డి, రఘునందర్ రావు, ఇతర నేతలు భారీ వర్షంలోనే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియ‌చేశారు. పోలీసుల తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్ర మంత్రినైన తన వాహనాన్ని అడ్డుకుంటారా? అని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ కమిషనర్ అక్కడకు వచ్చి కోరినా ఆయన వెన‌క్కు తగ్గలేదు. తాను ఇక్కడి నుంచి వెళ్తే బాట సింగారం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్దకే వెళ్తానని, లేకపోతే ఇక్కడే కూర్చుంటానని తెగేసి చెప్పారు. ఇది ప్రజాస్వామ్యమా? లేక నిజాం రాజ్యమా? అని ప్రశ్నించారు. మరోవైపు ఆయనను అక్కడి నుంచి తరలించే ప్రయత్నాన్ని పోలీసులు చేశారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పరిశీలనకు వెళ్తున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్ పోర్టు సమీపంలో దౌర్జన్యంగా హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారని నేత‌లు ఆరోపించారు.

75 ఏళ్ల భారతదేశ చరిత్రలో ఓ కేంద్ర కేబినెట్ మంత్రిని ప్రజాసమస్యలను పరిశీలించేందుకు వెళ్తుండగా అక్రమంగా అరెస్టు చేయ‌డం తొలిసారి అని నేత‌లు మండిప‌డ్డారు. ఈ అరెస్ట్ పై పార్లమెంటు స్పీకర్ కు ఫిర్యాదు చేస్తాన‌ని కిష‌న్ రెడ్డి తెలిపారు. కేంద్రమంత్రి కాన్వాయ్ కు డీసీఎంను అడ్డంపెట్టి ఆపేంత అవసరం ఏమొచ్చిందని ఆయ‌న మండిప‌డ్డారు. అక్క‌డ నుంచి బలవంతంగా కిషన్ రెడ్డిని వాహనం ఎక్కించిన పోలీసులు డ్రైవర్ ను దించేసి పోలీసులు వాహ‌నాన్ని తీపుకెళ్లారు కేంద్ర‌మంత్రి కిషన్ రెడ్డి వాహనాన్ని డీసీపీ స్థాయి అధికారి నడుపుతూ ఎక్కడకు తరలిస్తున్నారో చెప్పని పోలీసులు. కిషన్ రెడ్డిని అరెస్టు చేసి పోలీసులు తరలిస్తుండ‌టంతో శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వ‌ద్ద‌కు పెద్ద సంఖ్యలో బీజేపీ (BJP) కార్యకర్తలు, నాయకులు చేరుకున్నారు.

Also Read:  10 KG Tomatoes: దుబాయ్ నుంచి 10 కేజీల టమాటాలు ఇండియాకి.. ఆర్డర్ వేసిన తల్లి, ప్యాక్ చేసి పంపిన కూతురు..!