Site icon HashtagU Telugu

Khammam: కాకతీయ పాలకులు నిర్మించిన కోట.. చారిత్రాత్మక ఖమ్మం కోట, జాఫర్ మెట్ల బావికి పునరుద్ధరణ పనులు..!

Khammam

Resizeimagesize (1280 X 720) 11zon

Khammam: క్రీ.శ.950లో కాకతీయ పాలకులు నిర్మించిన చారిత్రాత్మక ఖమ్మం (Khammam) కోటకు రూపురేఖలు తీసుకొచ్చి ఆహ్లాదకరమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ఖమ్మం (Khammam) మున్సిపల్ కార్పొరేషన్ (KMC) శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే కోటలో వర్షపు నీటి నిల్వకు ఉపయోగించే మెట్ల బావి అయిన జాఫర్ బావిని పునరుద్ధరించే పనులు కూడా చేపట్టారు. ఒకప్పుడు తాగునీటికి ఆధారమైన ఈ బావి స్థానికులు చెత్తను అందులో వేయడంతో డంపింగ్‌ గ్రౌండ్‌గా మారింది.

పురావస్తు శాఖ అడిషనల్ డైరెక్టర్ జి మల్లు నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. కాకతీయుల కాలం నుంచి ఈ బావి కోటలో ఉంది. కానీ అసఫ్ జాహీల కాలంలో తాలూక్దార్, జాఫర్-ఉద్-దౌలా (1716-1803) బావిని పునరుద్ధరించాడు. ఆ తర్వాత దీనిని జాఫర్ బౌలి (బావి) అని పిలిచేవారు. ఇది 60 అడుగుల x 30 అడుగుల మెట్ల బావి. దాని చుట్టూ పురుషులు, గుర్రాలు తిరిగేందుకు వంతెన ఉంది. మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి మాట్లాడుతూ.. బావిని పునరుద్ధరించేందుకు కార్పొరేషన్ రూ.10 లక్షలు వెచ్చిస్తున్నట్లు తెలిపారు.

చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు తొలగించడం, పూడిక తీయడం, మురికి నీటిని బయటకు పంపడం వంటి పనులు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని బన్సీలాల్‌పేట స్టెప్‌వెల్‌ను పునరుద్ధరించిన పురావస్తు శాఖ, హైదరాబాద్‌కు చెందిన ది రెయిన్‌వాటర్ ప్రాజెక్ట్‌ల సమన్వయంతో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. జిల్లా కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సురభి, ది రెయిన్‌వాటర్‌ ప్రాజెక్ట్‌ వ్యవస్థాపకురాలు, సీఈవో కల్పనా రమేష్‌, పురావస్తుశాఖ అదనపు సంచాలకులు మల్లు నాయక్‌, నర్సింగ్‌ నాయక్‌ ఇటీవల మెట్లబావిని పరిశీలించారు.

చారిత్రక కట్టడాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా కోటను పరిరక్షించేందుకు, సుందరంగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. స్టెప్‌వెల్‌కు రసాయన శుద్ధి, డ్రెయిన్ నీరు బావిలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని, లైటింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. ఖమ్మం నగరం నడిబొడ్డున 4 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భారీ గ్రానైట్ కొండపై కోట ఉంది. ఇది ఒకేసారి కనీసం 60 ఫిరంగులను అమర్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అసఫ్ జాహీలు ఫ్రెంచ్ ఇంజనీర్ల సహాయంతో కోటను పునరుద్ధరించారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం.. ఈ కోట కాకతీయులు, కుతుబ్ షాహీలు, అసఫ్ జాహీలకు కోటగా పనిచేసింది. క్రీ.శ. 1515లో ఈ కోట శ్రీకృష్ణదేవరాయ చక్రవర్తి చేతుల్లోకి వెళ్లింది. ముసునూరి నాయకులు, వెలమ రాజులు కూడా కోట నిర్మాణంలో పాలుపంచుకున్నారు.