భగవద్గీత ను రాజకీయాల్లోకి తీసుకురావడం సర్వసాధారణం అయింది. ప్రతి హిందువు గీతాపారాయణం చేయాలని ఒకరు. పాఠ్యాంశంగా పెట్టాలని మరొకరు ఇలా పలు సందర్భాల్లో ప్రస్తావించారు. ఇప్పుడు తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ వైకుంఠధామాల్లో భగద్గీతను వినిపిస్తే దాడులు చేస్తామని హెచ్చరించారు. కొందరు కుట్రపూరితంగా భగవద్గీతను కించపరుస్తూ అంతిమయాత్రలకు, వైకుంఠధామాలకు పరిమితం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆ కుట్రలు ఇక సాగవని వార్నింగ్ ఇచ్చారు.
వైకుంఠధామ వాహనాలు ఇక నుంచి భగవద్గీతను పెట్టుకుని వెళుతుంటే, వాహనం టైర్ల గాలిని తీయాలని క్యాడర్ బండి పిలుపునిచ్చారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా జనగాం కేంద్రంగా జరిగిన బహిరంగ సభ వేదికగా ఆ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇచ్చిన వార్నింగ్ పై రాజకీయ దుమారం రేగుతోంది. ఇటీవల మసీదులను తవ్వితే త్రిశూలం, శివలింగం ఉంటే మాది, సమాధులు ఉంటే మీవి అంటూ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. కాశీ మహాక్షేత్రం ఆనుకున్న ఉన్న మసీదులో జరిగిన తవ్వకాల్లో త్రిశూలం బయటపడిన సందర్భంగా ఆనాడు బండి కీలక వ్యాఖ్యలు చేసి హిందూవాదాన్ని వినిపించారు. ప్రస్తుతం భగవద్గీతను తెలంగాణ రాజకీయ సీన్లోకి తీసుకొచ్చారు.
దేశంలోని పలు చోట్ల హిందూవాదాన్ని వినిపిస్తూ పలు సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. కర్నాటక రాష్ట్రంలో ముస్లిం మహిళలు వేసుకునే బుర్ఖాపై వివాదం రేగింది. మసీదుల్లో చేసే నమాజు లౌడ్ స్పీకర్లలో వినిపించరాదని హిందూవాదులు హెచ్చరించారు. మహారాష్ట్రలో నమాజును లౌడ్ స్పీకర్లలో వినిపిస్తే, తాము హనుమాన్ చాలీసా పారాయణం మైకుల్లో వినిపిస్తామని రోడ్ల మీదకు వచ్చారు. దీంతో కర్నాటక, మహారాష్ట్రల్లో బీజేపీ, హిందూఅతివాదులు బలంగా వాళ్ల వాదాన్ని వినిపించారు. దేశ వ్యాప్తంగా గాంధీ, గాడ్సే వ్యవహారాన్ని కూడా బీజేపీ లీడర్లు తరచూ నడుపుతున్నారు. గాడ్సేను దేశభక్తునిగా పోల్చుతూ బీజేపీ నేతలు కొందరు చెబుతున్నారు. ఇంకోవైపు ముస్లింలు ఆరాధించే దైవాన్ని కించపరిచేలా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నపూర్ శర్మ మాట్లాడారు. దీంతో ప్రపంచదేశాల్లో భారతదేశాన్ని వేరు చేసే ప్రయత్నం జరిగింది.
వజ్రోత్సవాల సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించిన కేసీఆర్ పక్కనే ఎంఐఎం చీఫ్ అసరుద్దీన్ ను పెట్టుకున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆయనతో భారత్ మాతాకీ జై కొట్టించగలరా? అంటూ కేసీఆర్‌కు సవాల్ చేశారు బండి సంజయ్. అంతేకాదు, భగవద్గీతపై కుట్ర చేస్తోన్న వాళ్లను వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన పిలుపు హిందూ వాదుల్లో చర్చగా మారింది. రాబోవు రోజుల్లో వైకుంఠధామానికి వెళ్లే వాహనాలు భగవద్గీతను వినిపించడానికి లేదని హుకుం జారీ చేశారు. భారత సంప్రదాయాన్ని, సంస్కృతిని , జీవన విధానాన్ని అందించే భగవద్గీతను చనిపోయిన వాళ్లకు పనికొచ్చేదానిలా చిత్రీకరించారని మండిపడ్డారు. ఇలాంటి కుట్రను చేధించాలని క్యాడర్ కు పిలుపునివ్వడం తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది.