Site icon HashtagU Telugu

Hindi Language: హిందీ కేవలం ఒక భాష కాదు- కోట్లాది భారతీయుల భావోద్వేగం: కేంద్ర మంత్రి

Bandi Sanjay

Bandi Sanjay

Hindi Language: హిందీ (Hindi Language) కేవలం సంభాషణకు ఒక సాధనం మాత్రమే కాదని, కోట్లాది భారతీయుల భావోద్వేగాలు, సంస్కృతికి అది ప్రతిరూపం అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ‘హిందీ దివస్’ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సమక్షంలో ఆయన ప్రసంగించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య హిందీ బలమైన వారధిగా పనిచేస్తుందని పేర్కొంటూ, అందుకే హిందీని భారత రాజభాషగా ఆమోదించారని గుర్తు చేశారు.

మాతృభాషకు ప్రాధాన్యత

ప్రతి వ్యక్తికి మాతృభాష హృదయానికి అత్యంత చేరువైనదని బండి సంజయ్ అన్నారు. శాస్త్రీయ, పరిశోధన, వైద్య పత్రాలు మాతృభాషలో అందుబాటులో ఉంటే ఆ జ్ఞానం మారుమూల గ్రామాలకు కూడా చేరుతుందని ఆయన నొక్కి చెప్పారు. హిందీతో పాటు అన్ని భారతీయ భాషలకు సమాన గౌరవం, అవకాశాలు లభిస్తేనే భారత ఐక్యత మరింత బలపడుతుందని అభిప్రాయపడ్డారు.

మోదీ-షా నాయకత్వంలో భాషా విప్లవం

ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా నాయకత్వంలో భాషా అభివృద్ధికి జరుగుతున్న కృషిని ఆయన ప్రశంసించారు. భాష కేవలం భావాల వ్యక్తీకరణ మాత్రమే కాదని, అది మన సంస్కృతి, సంప్రదాయం, జాతీయ చైతన్యానికి ఆత్మ వంటిదని ప్రధాని మోదీ అన్న మాటలను గుర్తు చేసుకున్నారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ సాధనకు స్థానిక భాషలు, మాతృభాషలే అతిపెద్ద శక్తి అని తెలిపారు. జాతీయ విద్యా విధానంలో భారతీయ భాషలకు ఇచ్చిన ప్రాధాన్యత గురించి వివరించారు. అమిత్ షా మార్గదర్శకత్వంలో హిందీ, భారతీయ భాషలను పరిపాలన, సాంకేతిక రంగాలలో ప్రోత్సహించడానికి రాజభాషా విభాగం చేపట్టిన చర్యలను వివరించారు.

Also Read: Tomato Price: భారీగా పడిపోయిన టమాటా ధరలు.. రైతన్న కన్నీరు

సాంకేతికతతో భారతీయ భాషల అనుసంధానం

‘హిందీ శబ్ద సింధు’ డిజిటల్ నిఘంటువులో లక్షల పదాలు ఉన్నాయని, వీటిలో భారతీయ భాషల నుంచి సేకరించిన పదాలు కూడా ఉన్నాయని బండి సంజయ్ తెలిపారు. ఇది కేవలం హిందీని విస్తరించడం కాదని, భారతీయ భాషల మధ్య ఒక అనుసంధాన వంతెనను నిర్మించడమని చెప్పారు. కంఠస్థ్, అనువాద్ సాధన్ వంటి ఆధునిక టూల్స్ వల్ల హిందీ, ఇతర భారతీయ భాషలు పరిపాలన, విద్య, సాంకేతికతలతో సులభంగా అనుసంధానమయ్యాయని అన్నారు.

ప్రపంచ వేదికపై హిందీ స్థానం

ప్రపంచ వేదికపై హిందీకి బలమైన స్థానం లభించిందని, విద్య, కమ్యూనికేషన్, పరిపాలనలో దాని ప్రాధాన్యత పెరుగుతోందని బండి సంజయ్ పేర్కొన్నారు. హిందీ సినిమా, సాహిత్యం, జర్నలిజం దీనిని కొత్త శిఖరాలకు చేర్చాయని అన్నారు. విదేశాల్లో కూడా కోట్లాది మంది హిందీని మాట్లాడుతున్నారని, అర్థం చేసుకుంటున్నారని తెలిపారు.

న్యాయం, విజ్ఞానం ప్రజలకు చేరువ

భవిష్యత్తులో హిందీ, ఇతర భారతీయ భాషలకు విద్య, వ్యాపారం, సాంకేతికతలతో సహా అన్ని రంగాల్లో స్థానం కల్పించాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. వైద్య పరిశోధన పత్రాలు, ఇంజనీరింగ్, సాంకేతిక అంశాలపై పరిశోధనలు, కోర్టు తీర్పులు మాతృభాషలలో ఉంటే జ్ఞానాన్ని ప్రజలకు చేరువ చేయవచ్చని చెప్పారు. ఇది నిజమైన అర్థంలో ‘ఆత్మనిర్భర్ భారత్’ కలను సాకారం చేస్తుందని పేర్కొన్నారు.

అంతిమంగా హిందీతో పాటు అన్ని భారతీయ భాషలకు సమాన గౌరవం, అవకాశాలు లభిస్తేనే భారత ఐక్యత మరింత బలపడుతుందని బండి సంజయ్ అన్నారు. ఈ సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా నాయకత్వంలో భాషా యాత్ర కొనసాగుతుందని, ఇది దేశాన్ని ఆత్మనిర్భర్, విశ్వగురువుగా తీర్చిదిద్దడంలో గొప్ప పాత్ర పోషిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.