Khammam Issue : కేటీఆర్ ప‌ర్య‌ట‌న‌కు ముందు ఖమ్మంలో తీవ్ర ఉద్రిక్తత.. ప్రభుత్వ ఆస్పత్రిపై బీజేపీ కార్యకర్తల దాడి..

ఖ‌మ్మంలో రాజ‌కీయ వేడి ర‌గులుకుంది. పోలీసులు వేధిస్తున్నారంటూ సాయి గ‌ణేష్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న టీఆరెస్ వ‌ర్సెస్ బీజేపీ పోరులా మారింది.

  • Written By:
  • Publish Date - April 16, 2022 / 03:56 PM IST

ఖ‌మ్మంలో రాజ‌కీయ వేడి ర‌గులుకుంది. పోలీసులు వేధిస్తున్నారంటూ సాయి గ‌ణేష్ ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న టీఆరెస్ వ‌ర్సెస్ బీజేపీ పోరులా మారింది. బీజేపీ మజ్జూరు సంఘం జిల్లా అధ్యక్షునిగా ఉన్న సాయి గణేష్ మృతితో ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. మంత్రి పువ్వాడ అజయ్‌ ఒత్తిడితో పోలీసులు తప్పుడు కేసులు పెట్టడం వల్లే సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్నాడని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. అయితే ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో సాయి గణేష్‌ మృతదేహానికి పోస్టుమార్టమ్ ఆలస్యం చేస్తున్నారని బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రభుత్వ ఆస్పత్రిపై దాడి చేశారు. ఆస్పత్రి అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది.

మ‌రోవైపు, కేటీఆర్ ఖ‌మ్మం ప‌ర్య‌ట‌న నేప‌ధ్యంలో రాజ‌కీయంగా కూడా ఈ అంశాన్నివాడుకోవాల‌ని బీజేపీ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే నగరంలో టీఆర్‌ఎస్ నాయకుల ఫ్లెక్సీలకు బీజేపీ కార్యకర్తలు నిప్పు పెట్టారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మృతిచెందిన సాయి గణేష్ కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. దీంతో ఖమ్మం నగరంలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. అయితే పోలీసులు మాత్రం లంచ్ టైమ్ కావడంతో పోస్టుమార్టమ్ ప్రక్రియ ఆలస్యం అయిందని చెబుతున్నారు. ఇక, ఫ్లెక్సీ చింపుతుండగా ఓ తమ కార్యకర్తపై టీఆర్ఎస్ శ్రేణులు దాడులు చేశాయని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. అయితే గాయపడినట్టుగా చెబుతున్న బీజేపీ కార్యకర్త.. ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.