AP Vs Telangana : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న నాగార్జునసాగర్ జలాల వివాదంపై కేంద్ర జల శక్తిశాఖ ఆధ్వర్యంలో శనివారం (డిసెంబరు 2న) వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఈరోజు హాజరు కాలేనని, సమావేశం తేదీని మార్చాలని తెలంగాణ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈసందర్భంగా కోరారు. ఏపీ తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద నెలకొన్న పరిస్థితులను ఆయన వివరించారు. విభజన చట్టంలో పేర్కొన్న నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఏపీ తాగునీటి అవసరాలకు అనుగుణంగా నీటి విడుదలకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా తెలంగాణ సర్కారు పట్టించుకోవడం లేదని తెలిపారు. 6వ తేదీన జరిగే సమావేశంలో అన్ని అంశాలను ప్రస్తావిస్తామని ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో చర్చించిన కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ .. డిసెంబరు 6న మరోసారి సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.
We’re now on WhatsApp. Click to Join.
నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణపై డిసెంబర్ 6న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎస్‌లు, ఇతర అధికారులతో కేంద్ర జల శక్తిశాఖ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు సంయమనం పాటించాలని ఇరు రాష్ట్రాలకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ సూచించారు. నీటి విడుదలకు సంబంధించి ఏపీ ఇచ్చిన ఇండెంటుపై ఈనెల 4వ తేదీన సోమవారం కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం కానుందని.. ఆ తర్వాతే నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని కేఆర్ఎంబీ ఛైర్మన్ శివనందన్‌ను దేబశ్రీ ముఖర్జీ ఆదేశించారు. అప్పటివరకు నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి నీటి విడుదలను ఆపాలని కోరారు. ఈనెల 6న అన్ని అంశాలపై చర్చించి వివాదం పరిష్కారానికి(AP Vs Telangana) కృషి చేస్తామన్నారు.
Also Read: TS Govt DA Release : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఈసీ గుడ్ న్యూస్..
