Telangana Budget: తెలంగాణ ప్రజలకు తీపి కబురు.. ఆదాయం పెరగడంతో భారీ బడ్జెట్ కు కసరత్తు.. దళితబంధుకు..

2022-23 ఆర్థిక సంవ‌త్సరం వార్షిక బ‌డ్జెట్‌పై తెలంగాణ ప్రభుత్వం క‌స‌ర‌త్తు ప్రారంభించింది. సొంత ఆర్థిక వ‌న‌రులు సంతృప్తిక‌రంగా ఉంటాయ‌న్న న‌మ్మకంతో భారీ బ‌డ్జెట్‌నే రూపొందించ‌నుంది.

  • Written By:
  • Publish Date - February 19, 2022 / 09:06 AM IST

2022-23 ఆర్థిక సంవ‌త్సరం వార్షిక బ‌డ్జెట్‌పై తెలంగాణ ప్రభుత్వం క‌స‌ర‌త్తు ప్రారంభించింది. సొంత ఆర్థిక వ‌న‌రులు సంతృప్తిక‌రంగా ఉంటాయ‌న్న న‌మ్మకంతో భారీ బ‌డ్జెట్‌నే రూపొందించ‌నుంది. ప్రస్తుత ఆర్థిక సంవ‌త్సరంతో పోల్చితే క‌నీసం రూ.20 వేల కోట్లు అధికంగా ఉండే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ప్రస్తుత బ‌డ్జెట్ ప‌రిణామం రూ.2.30 ల‌క్షల కోట్లు కాగా, రానున్న సంవ‌త్సరంలో అది రూ.2.50 ల‌క్షల కోట్లకు పెరిగే సూచ‌న‌లు ఉన్నాయి.

రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య ప‌థ‌కాలైన ద‌ళిత బంధు, వ్యవ‌సాయం, ఇత‌ర సంక్షమ ప‌థ‌కాల‌కు కేటాయింపులు పెరిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. రాష్ట్ర సొంత ఆదాయం పెర‌గ‌డానికి జీఎస్టీ, ఇత‌ర అమ్మకం ప‌న్నులే ప్రధాన కార‌ణం కానున్నాయి. వ‌చ్చే సంవ‌త్సరం వీటి ద్వారా వ‌చ్చే ఆదాయం 15-20 శాతం మేర పెరుగుతుంద‌ని అధికార వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవ‌త్సరానికి పెట్టుకున్న ల‌క్ష్యం డిసెంబ‌రు 25 నాటికే చేరుకున్నందున వ‌చ్చే ఏడాది మ‌రింత ఆదాయం వ‌స్తుంద‌ని ప్రభుత్వం గ‌ట్టి విశ్వాసంతో ఉంది.

రిజిస్ట్రేష‌న్ల ఆదాయం కూడా రూ.2,500 కోట్ల మేర పెరిగే సూచ‌న‌లు ఉన్నాయి. ఈ ప‌ద్దు కింద ప్రస్తుతం రూ.12,500 కోట్లు రానుండ‌గా, అది రూ.15 వేల కోట్లకు పెరిగే అవ‌కాశం ఉంది. వీటితో పాటు ప్రభుత్వ భూముల అమ్మకం ద్వారా మ‌రింత‌గా ఆదాయం సంపాదించాల‌న్నది సర్కారు ఆలోచ‌నగా క‌నిపిస్తోంది.

రాజ‌ధాని హైద‌రాబాద్ చుట్టుప‌క్కల రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకోవ‌డం, ప్రభుత్వ భూములపై ఉన్న వివాదాలు తొల‌గిపోవ‌డం కూడా విక్రయాల‌కు ఆటంకాల‌ను తొల‌గించినట్టే. వీటి ద్వారా క‌నీసం రూ.20 వేల కోట్లు రాబట్టాల‌న్నది ఆలోచ‌న‌గా క‌నిపిస్తోంది. మొత్తంగా రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి బాగుండ‌డంతో రుణం తీసుకొనే సామ‌ర్థ్యం కూడా పెరిగింది.

రానున్న సంవ‌త్సరంలో రూ.45 వేల కోట్ల వ‌ర‌కు రుణం తీసుకొనే అవ‌కాశాన్ని కేంద్ర ప్రభుత్వం క‌ల్పించ‌నుంది. ఇవి కాకుండా కేంద్రం ఇచ్చే నిధులు, ఇత‌ర‌త్రా ఆదాయవనరులు క‌లుపితే రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ఆశాజ‌న‌కంగా ఉంటుంద‌ని ప్రభుత్వం భావిస్తోంది.