Site icon HashtagU Telugu

KCR : కేసీఆర్‌కు షాక్.. రిట్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

Kcr High Court

KCR : బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రానికి విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో జరిగిన అవకతవకలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్‌ కమిషన్‌ను రద్దు చేయాలంటూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. జ్యుడీషియల్‌ కమిషన్‌కు సారథ్యం వహిస్తున్న జస్టిస్ నర్సింహారెడ్డిని ప్రతివాదిగా చేర్చడంపై హైకోర్టు రిజిస్ట్రీ ఇంతకుముందు అభ్యంతరం తెలిపింది.  వాస్తవానికి కేసీఆర్(KCR) దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు శుక్రవారం రోజే ముగిశాయి. ఆరోజు తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు.. ఇవాళ దాన్ని వెలువరించింది. ఇప్పటివరకు కేసీఆర్‌కు జ్యుడీషియల్‌ కమిషన్‌ రెండుసార్లు ‘8బీ’ నోటీసులు ఇచ్చింది. కేసీఆర్‌కు కమిషన్‌ ఏప్రిల్‌లో నోటీసులు జారీ చేసింది. అయితే లోక్‌సభ ఎన్నికల కారణంగా జులై వరకు రావడం కుదరదని ఆయన తేల్చి చెప్పారు. దీంతో ఎన్నికలు ముగిశాక జూన్‌ 15న విచారణకు రావాలంటూ మరోసారి జ్యుడీషియల్ కమిషన్ కేసీఆర్‌కు నోటీసులు పంపింది.  విచారణకు రావాల్సిన వారికి 8బీ నోటీసులు జారీ చేసే అధికారం జ్యుడీషియల్ కమిషన్లకు ఉంటుందని నిబంధనలు చెబుతున్నాయి.

We’re now on WhatsApp. Click to Join

శుక్రవారం జరిగిన వాదనలివీ.. 

ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్‌ కొనుగోళ్లలో ఎక్కడా అవకతవకలు జరగలేదని.. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా జ్యుడీషియల్ కమిషన్‌‌ను ఏర్పాటు చేశారని కేసీఆర్‌ తరఫు  న్యాయవాది ఆదిత్య సోందీ వినిపించిన వాదనలతో హైకోర్టు ఏకీభవించలేదు. ఇక తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈ కేసులో ఏజీ సుదర్శన్‌రెడ్డి  వాదనలు వినిపించారు. ‘‘జ్యుడీషియల్ కమిషన్ల ఏర్పాటు విషయంలో కోర్టులు కలుగజేసుకోలేవు’’ అని చెప్పారు.  ఈ అవకతవకల వ్యవహారంలో 15 మంది సాక్ష్యులను ఇప్పటి వరకు  కమిషన్ విచారించిందన్నారు. పూర్తిగా జ్యుడీషియల్ కమిషన్‌నే రద్దు చేయాలనే కేసీఆర్ వాదనతో హైకోర్టు విభేదించింది. అందుకే ఆయన పిటిషన్‌ను కొట్టివేసింది. దీనిపై కేసీఆర్ ఎలా స్పందిస్తారు ? తదుపరిగా అప్పీల్ పిటిషన్ దాఖలు చేస్తారా ? అనేది వేచిచూడాలి.

Also Read :Sabitha Indra Reddy : పార్టీ మారడం ఫై మాజీ మంత్రి సబితా క్లారిటీ