KCR Delhi Tour : ఢిల్లీ రమ్మన్నారా?వెళ్ళారా?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. ఎవ‌రైనా ర‌మ్మ‌న్నారా? ఆయ‌న‌కై ఆయ‌నే వెళ్లారా? ఆయ‌న ఢిల్లీ ఎజెండా ఏమిటి?

  • Written By:
  • Publish Date - July 27, 2022 / 07:00 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. ఎవ‌రైనా ర‌మ్మ‌న్నారా? ఆయ‌న‌కై ఆయ‌నే వెళ్లారా? ఆయ‌న ఢిల్లీ ఎజెండా ఏమిటి? అనేది హాట్ టాపిక్‌. ఎప్పుడు ఢిల్లీ వెళ్లిన‌ప్ప‌టికీ ప్ర‌గ‌తిభ‌వ‌న్ చెప్పే షెడ్యూల్ ఒక‌టి హ‌స్తిన కేంద్రంగా జ‌రిగేది మ‌రొక‌టిగా ఉంటుంది. అందుకే, ఇప్పుడు ఆయ‌న ఢిల్లీ ఎందుకు వెళ్లారు? అనే చ‌ర్చ జ‌రుగుతోంది.

రాష్ట్రంలో వ‌ర‌ద ముంపు ప్ర‌మాదంగా మారింది. కాళేశ్వ‌రంతో స‌హా ప్రాజెక్టుల‌న్నీ ప్ర‌మాదంలోకి వెళ్లాయి. పంట న‌ష్టం అపారంగా జ‌రిగింది. వ‌ర‌ద బాధితుల‌కు భ‌రోసా ఇచ్చే వాళ్లు లేరు. ఇలా ప‌లు ర‌కాల స‌మ‌స్య‌లు రాష్ట్రంలో ఉన్న‌ప్ప‌టికీ కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. అంటే, ఏదో పెద్ద ర‌హ‌స్యం ఉంటుంద‌ని ఆయ‌న గురించి బాగా తెలిసిన వాళ్లు భావిస్తున్నారు.
దేశ‌ రాజధాని ఢిల్లీ, విదేశీ పర్యటన, ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రతి సందర్భంలోనూ పక్కా ప్రణాళికతో ఆయన వెళుతుంటారు. అలాంటి కేసీఆర్ ప్ర‌స్తుతం ప్రగతి భవన్‌, ఫాంహౌస్ , ఢిల్లీకి పరుగులు తీస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో చేపట్టే పలు డెవలప్ మెంట్ పనులకు సంబంధించి వివిధ సంస్థలతో చేసుకున్న రుణ ఒప్పందాలకు భిన్నంగా ఆయా రుణ సంస్థలు వ్యవహరిస్తున్న తీరు ను స‌రిదిద్దుకునేందుకు ఢిల్లీ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింద‌ని తెలుస్తోంది. కాళేశ్వరం సాగునీటి ఎత్తిపోతల కార్పొరేషన్ కు రుణాలు ఇచ్చిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ గ్రామీణ విద్యుదీకరణ సంస్థ తాజాగా షరతుల్ని మార్చటం సీఎం కేసీఆర్ కు నచ్చలేదు. ఒప్పందం అయ్యాక మళ్లీ షరతులు మార్చటం ఏమిటి? అన్న ప్రశ్నను కేసీఆర్ కు బోధ‌ప‌డ‌డంలేదు.

ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో దాదాపు ఎనిమిది గంటల పాటు నిర్వహించిన భేటీలో కీలక అంశాల్ని చర్చించటంతో పాటు తాజాగా పెడుతున్న ఇబ్బందుల‌పై కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారు. ఈ కారణంతోనే ఆయన ఢిల్లీకి వెళ్లార‌ని తెలుస్తోంది. రుణ సంస్థల నిర్ణయం మార్చ‌డంపై సీనియర్ అధికారుల నుంచి ఆయన వినటంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏమేం చేయగలదన్న దానిపైనా కసరత్తు చేస్తున్నార‌ట‌. ఇదంతా ఇటీవ‌ల మోడీని టార్గెట్ చేయ‌డం కార‌ణంగా కేసీఆర్ కు వ‌చ్చిన క‌ష్టాలుగా చెబుతున్నారు.

ఇత‌ర‌ రాష్ట్రాల్లోని మంత్రులు వేలెత్తి చూపించని ఎన్నో అంశాల్ని కేటీఆర్ చూపిన వైనం కేంద్రానికి ఆగ్రహానికి గురయ్యేలా చేసింది. కేంద్రం తీరు నేపథ్యంలో అధికారులతో భేటీ నిర్వహించి, రాష్ట్ర వాదనను వినిపించాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. ఒకవేళ అలా సాధ్యం కాకుంటే, ప్రధానమంత్రి నరేంద్రమోడీతో భేటీ అయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కానీ, ఇప్పుడు ప‌రిస్థితుల్లో మోడీ అపాయిట్మెంట్ దొర‌క‌డం క‌ష్ట‌మే.

హైదరాబాద్ లో ఎదురైన వరుస అనుభవాల క్ర‌మంలో తెలంగాణ రాష్ట్రాన్ని వదిలి ఢిల్లీలో చర్చలు పెట్టేలా చేశారన్న మాట వినిపిస్తోంది. రుణ సంస్థల నుంచి అందే సాయంలో తేడా వస్తే, తెలంగాణ డెవలప్ మెంట్ కు సంబంధించి ఎదురయ్యే ఇబ్బందులు కేసీఆర్ కు తెలియంది కాదు. అందుకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఢిల్లీకి హుటాహుటిన బయలుదేరారని చెప్పాలి. ఢిల్లీకి కేసీఆర్ వెళ్లారనే దాని కంటే , వెళ్లటం వెనుక మోడీ ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం మీద ఢిల్లీతో ఢీ కొట్ట‌డానికి కేసీఆర్ చేస్తోన్న ప్ర‌య‌త్నం ఫ‌లించ‌డంలేదు. ఇలాంటి సంద‌ర్భాల్లో ఆయ‌న ఏం చేస్తారు? అనేది పెద్ద ప్ర‌శ్న‌.