Intermediate Exam Results Date 2026 ఏపీ, తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీల మధ్య విడుదలయ్యే అవకాశం ఉంది. సుమారు 10 లక్షల మంది విద్యార్థులు హాజరైన ఈ పరీక్షల మూల్యాంకనం పూర్తయింది. మార్చి 18తో పరీక్షలు ముగియగా, ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. మరోవైపు ఆయా బోర్డులు స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నాయి. ఇంటర్ బోర్డు త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనుంది. ఈ ఫలితాల తర్వాత పదో తరగతి ఫలితాలు కూడా రానున్నాయి.
తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు సర్వం సిద్ధం చేస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీల మధ్య ఫలితాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ దాదాపుగా పూర్తి కావడంతో.. కంప్యూటరీకరణ, రీవెరిఫికేషన్ వంటి అంశాలను వేగంగా పూర్తి చేసేలా ప్రణాళికతో ముందుకెళుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి 25న ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు మార్చి 18వ తేదీతో ముగిశాయి. మొత్తం 1,495 పరీక్షా కేంద్రాల్లో సుమారు 9,97,075 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ప్రథమ సంవత్సర పరీక్షలు ఫిబ్రవరి 25న మొదలవ్వగా.. మరుసటి రోజైన 26 నుంచి ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరిగాయి. గతంతో పోలిస్తే ఈసారి పరీక్షలు అత్యంత పకడ్బందీగా.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగియడం గమనార్హం. ఫలితాల విడుదల ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ఉండేందుకు ఇంటర్ బోర్డు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. జవాబు పత్రాల స్కానింగ్, కోడింగ్, డీ-కోడింగ్ ప్రక్రియలను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఫలితాల వెల్లడికి సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు మరికొద్ది రోజుల్లోనే అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.
పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://tgbie.cgg.gov.in/ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. ఫలితాల రోజున వెబ్‌సైట్‌పై ఒత్తిడి పెరిగి సాంకేతిక ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేయడం ద్వారా మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాల అనంతరం రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్‌కు సంబంధించిన గడువును కూడా బోర్డు వెంటనే ప్రకటించనుంది. ముందుగా ఇంటర్ ఫలితాలను విడుదల చేసి.. ఆ తర్వాతే పదో తరగతి ఫలితాల వైపు అధికారులు దృష్టి సారించనున్నారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు జరుగుతుండగా.. ఈనెల 16తో పరీక్షలు ముగియనున్నాయి.
ఏపీ ఇంటర్ ఫలితాలు ఎప్పుడు..?
ఏపీలో కూడా ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యాయి. ప్రస్తుతం స్పాట్ వాల్యూయేషన్ కొనసాగుతోంది. విడతల వారీగా ఏప్రిల్ 14వ తేదీలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. స్పాట్ వాల్యూయేషన్లో ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టింది. పేపర్ వాల్యూయేషన్ తర్వాత సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ పరిశీలిస్తారు. ఆపై చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, స్క్రూటినైజర్ దశలుంటాయి. ఈ ప్రక్రియను కూడా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని బోర్డు భావిస్తోంది.
ఏప్రిల్ 21వ తేదీలోపు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఆలస్యమైతే ఏప్రిల్ చివరి వారంలోపే రావొచ్చని తెలుస్తోంది. మరోవైపు రెండు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి కాలేజీలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మే 31 నాటికే సప్లిమెంటరీ ఫలితాలను కూడా పూర్తి చేయాలని ఆయా బోర్డులు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఏపీ ఇంటర్ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి..?
ఏపీ ఇంటర్ విద్యార్థులు https://resultsbie.ap.gov.in/ వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. ఏపీ ఫస్టియర్ రిజల్ట్, సెకండియర్ రిజల్ట్స్ నేరుగా చెక్ చేసుకోవచ్చు.
మనమిత్ర వాట్సాప్‌లో ఇలా..
మనమిత్ర వాట్సప్‌లో 95523 00009 నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ సెండ్ చేయాలి.
రిప్లైలో వచ్చే ఆప్షన్లలో ‘Select Service’ ఎంచుకోండి.
తర్వాత ‘Education Services’ ఆప్షన్ క్లిక్ చేయండి.
ఇంటర్ పరీక్షల ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోండి అని కనబడుతుంది.
ఫలితాల డౌన్‌లోడ్ ఆప్షన్ యాక్టివ్ అయిన తర్వాత మీ హాల్‌టికెట్ నెంబర్ నమోదు చేయాలి.
మీ వాట్సప్ నెంబర్‌కు వచ్చే ఫలితాలు / మార్కుల షార్ట్ మెమో పీడీఎఫ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
