హుజూరాబాద్ బైపోల్ కి భారీ పోలీస్ భద్రత !

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి శనివారం జరగనున్న ఉప ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఎన్నికల సంఘం ప్రత్యేక కోవిడ్ ప్రోటోకాల్ను జారీ చేసింది

  • Written By:
  • Updated On - October 29, 2021 / 10:51 PM IST

 

కరీంనగర్: హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి శనివారం జరగనున్న ఉప ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఎన్నికల సంఘం ప్రత్యేక కోవిడ్ ప్రోటోకాల్ను జారీ చేసింది. ప్రతి ఒక్క ఓటరు మాస్క్ ధరించి రావాలి..పోలింగ్ కేంద్రంలో భౌతికదూరం పాటించాలని ఈసీ పేర్కొంది. నియోజకవర్గంలోని వీణవంక, జమ్మికుంట, ఇల్లందకుంట, హుజూరాబాద్, కమలాపూర్ మండలాల్లో 306 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అసెంబ్లీ సెగ్మెంట్ లో 2,37,036 మంది ఓటర్లు ఉండగా… అందులో 1,17,933 మంది పురుషులు, 1,19,102 మంది స్త్రీలు ఉన్నారు. 149 మంది అభ్యర్థులు సర్వీస్ ఓటర్లుగా నమోదు కాగా, 14 మంది విదేశీ ఓటర్లు. ఒక ట్రాన్స్ జెండర్ ఓటు ఉంది.

పోలింగ్ కోసం మొత్తం 306 ఈవీఎంలను అధికారులు వినియోగించనున్నారు.306 కంట్రోల్ యూనిట్లు, 612 బ్యాలెట్ యూనిట్లతో పాటు 306 VVPATలు ఉపయోగించనున్నారు. ఇదిలా ఉండగా అత్యవసర పరిస్థితుల్లో వినియోగించేందుకు 115 కంట్రోల్ యూనిట్లు, 279 బ్యాలెట్ యూనిట్లు, 209 వీవీప్యాట్లను రిజర్వ్లో ఉంచనున్నారు. హుజూరాబాద్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రంలో ఎన్నికల అధికారులు ఈవీఎంలు, ఇతర పోలింగ్ సామగ్రిని భద్రపరిచారు. శుక్రవారం పోలింగ్ సిబ్బందికి పంపిణీ కేంద్రం నుంచి ఇచ్చిన ఈవీఎంలు, ఇతర పోలింగ్ సామగ్రితో సాయంత్రంలోగా తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.

రేపు ఎన్నికలు పూర్తైన తరువాత కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్లో ఈవీఎంలు, ఇతర పోలింగ్ సామగ్రిని సిబ్బంది అధికారులకు అప్పగిస్తారు. ఎస్ఆర్ఆర్ కళాశాల మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలను భద్రపరుస్తారు. ఎస్ఆర్ఆర్ కళాశాలలో కౌంటింగ్కు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్ 2 న వెలువడనున్నాయి.

కరోనా కారణంగా పోలింగ్ సమయాన్ని ఎలక్షన్ కమిషన్ పొడిగించింది.ఓటర్లు తమ ఓటు హక్కును ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు వినియోగించుకోవచ్చు. కరోనా పాజిటివ్ వచ్చిన వారు నింబంధనలు పాటిస్తూ సాయంత్రం చివరి గంటలో తమ ఓటు హక్కుని వినియోగించవచ్చని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఎన్నికల అధికారులు ప్రతి పోలింగ్ స్టేషన్లో పీపీఈ కిట్లను ఏర్పాటు చేశారు. గురువారం సాయంత్రం నుంచి శనివారం వరకు డ్రై డేగా ప్రకటించడంతో వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి.

మరోవైపు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక యావత్ దేశం దృష్టిని ఆకర్షించినందున..పోలింగ్ పక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఎలక్షన్ కమిషన్ 20 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు రెండు కంపెనీల రాష్ట్ర బలగాలను కూడా హుజురాబాద్లో దింపింది. కేంద్రబలగాలతో పాటు అదనపు డీసీపీలు ఇద్దరు, 15 మంది ఏసీపీలు, 65 మంది సీఐలు, 180 మంది ఎస్ఐలతో పాటు 2 వేల మంది పోలీసులు కూడా పోలింగ్ బందోబస్తు విధుల్లో నిమగ్నమై ఉన్నారు.

ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో 10 చెక్పోస్టులు, పది ఫ్లయింగ్ స్క్వాడ్లు, 5 ఎంసీసీ, 10 వీఎస్టీ బృందాలను ఈసీ ఏర్పాటు చేసింది. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ పద్ధతిలో ఎంపిక చేశారు. గురువారం హుజూరాబాద్లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో భారత ఎన్నికల కమిషనర్ జనరల్ అబ్జర్వర్ ముత్తుకృష్ణన్ శంకర్నారాయణ సమక్షంలో మూడో స్థాయి ర్యాండమైజేషన్ జరిగింది.

306 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు 306 మంది ప్రిసైడింగ్ అధికారులు, 306 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 612 మంది ఇతర పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా ఎంపిక చేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో వినియోగించుకునేందుకు 40 శాతం పోలింగ్ సిబ్బందిని రిజర్వ్లో ఉంచామన్నారు.