Heavy Rains : తెలంగాణలో భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ

తెలంగాణ‌లో రాబోయే రెండు రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలకు వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.

  • Written By:
  • Updated On - July 9, 2022 / 12:35 PM IST

తెలంగాణ‌లో రాబోయే రెండు రోజుల పాటు భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలకు వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. నల్గొండ పట్టణంలో గోడ కూలి ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్‌ జారీ చేశారు.

అలాగే కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలు, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. భారీ వర్షాల కారణంగా అనేక లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోవడం, రైలు, రోడ్డు రవాణాకు అంతరాయం, విద్యుత్తు, ఇతర సామాజిక అవాంతరాలు, డ్రైనేజీలు మూసుకుపోవడం, పంట నష్టం జరిగే అవకాశం ఉన్నందున తెలంగాణలో అధికారులు అప్రమత్తమయ్యారు.

కొమరం భీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, వరంగల్‌ (రూరల్‌)లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్‌ కార్యాలయం అధికారి కె. నాగ రత్న తెలిపారు.మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో జనజీవనం స్తంభించింది. కొన్ని జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని పట్టణాల్లో నీటి ఎద్దడి వ‌చ్చింది. ఖమ్మం జిల్లాలోని సింగరేణి కాలరీస్‌కు చెందిన కొన్ని ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో గురువారం నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, కాలువలు, సరస్సులు పొంగిపొర్లడంతో పాటు రోడ్లు నీటమునిగి కొన్ని చోట్ల వాహనాల రాకపోకలను ప్రభావితం చేశాయి.

పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఆసిఫాబాద్‌ జిల్లాలోని కొమరం భీమ్‌ ప్రాజెక్టు గేట్లను తెరిచి నీటిని దిగువకు వదిలారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగట్ట, సరస్వతి, పార్వతి బ్యారేజీలకు కూడా ఇన్‌ఫ్లోలు వస్తున్నాయి. నీటిని విడుదల చేసేందుకు అధికారులు గేట్లు తెరిచారు. వాతావరణ శాస్త్రవేత్తల ప్రకారం, దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో వాయువ్య మరియు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.