ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి ‘ఇన్వెస్ట్ 988’ అనే కోడ్ నేమ్ ఇవ్వడం వాతావరణ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఇది మయన్మార్ యాంగోన్‌కు పశ్చిమంగా ఉన్నా, సాధారణంగా అల్పపీడనాలు బలహీనపడతాయి. అయితే, ఈసారి బలహీనత తర్వాతే గాలుల వేగం మరింత పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీని ప్రభావం సోమ, మంగళవారాల్లో తెలుగు రాష్ట్రాలపై స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. గాలి దిశలు, వేగం, తేమ శాతం మార్పులు అన్ని కలిపి వర్షపాతం తీవ్రతను పెంచే అవకాశముందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
తెలంగాణలో ఈరోజు (సెప్టెంబర్ 21) నుంచి 22వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఎక్కువ జిల్లాలు మేఘావృతంగా మారి, సాయంత్రం నుంచి రాత్రివరకు వర్షాలు కురుస్తాయి. ఏపీ విషయానికి వస్తే, రాయలసీమలో ఎక్కువగా మేఘావృత వాతావరణం కనిపించినప్పటికీ వర్షం పడే అవకాశాలు తక్కువ. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో మాత్రం సాయంత్రం నుంచి రాత్రివరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షపాతం వలన కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం, విద్యుత్ అంతరాయం వంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది.
H-1B Visa Fee Hike: హెచ్-1బి వీసా ఫీజు పెంపు.. భారతదేశానికి ప్రయోజనమా??
ప్రస్తుతం ఏర్పడిన రగాసా (Ragasa) తుపాను, అలాగే నియోగురి (Neoguri) తుపానుల ప్రభావం కూడా ఆసియా, ఆగ్నేయాసియా, దక్షిణ భారత వాతావరణంపై ఉంటుందని అంచనా. రగాసా తుపాను గంటకు 240 కిలోమీటర్ల వేగంతో చైనా దక్షిణ తీరం వైపు దూసుకెళ్తుండగా, నియోగురి తుపాను కూడా 250 కిలోమీటర్ల వేగంతో సముద్రంలో చక్రవాతంగా తిరుగుతోంది. ఇవి మన తెలుగు రాష్ట్రాలపై నేరుగా ప్రభావం చూపకపోయినా, గాలుల ప్రవాహం, మేఘాల కదలికలపై పెద్ద ఎత్తున ప్రభావం చూపుతున్నాయి. ఈ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వచ్చే కొన్ని రోజులు ఉరుములు, మెరుపులు, జల్లులు నుంచి భారీ వర్షాలు దాకా అనూహ్య వాతావరణ మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. కాబట్టి ప్రజలు సాయంత్రం తర్వాత బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించడం అత్యవసరం.
