Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు

ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న తెలంగాణకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్‌ తీర ప్రాంతంలో అల్పపీడనం.. ఇటు మరో ద్రోణి కూడా ఏర్పడింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో పలు చోట్ల జల్లులతో పాటు ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురు గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. శుక్రవారం వేకువజామున హైదరాబాద్‌లో కూడా వాన […]

Published By: HashtagU Telugu Desk
Heavy rains in Telangana

Heavy rains in Telangana

ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న తెలంగాణకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్‌ తీర ప్రాంతంలో అల్పపీడనం.. ఇటు మరో ద్రోణి కూడా ఏర్పడింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో పలు చోట్ల జల్లులతో పాటు ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురు గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. శుక్రవారం వేకువజామున హైదరాబాద్‌లో కూడా వాన పడింది. శనివారం ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావం ఈ నెల 22 వరకు కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

గురువారం సాయంత్రం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఆయా జిల్లాల్లో మోస్తరు వర్షాలు, జల్లులు పడ్డాయి. రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 4.3 సెంటీమీటర్లు.. నల్గొండ జిల్లా చండూరులో 3.5 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. అంతేకాదు గురువారం పలు జిల్లాల్లో పగటిపూట సాధారణం కన్నా 3 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్‌లో 3.8 డిగ్రీలు పెరిగి 35.5 డిగ్రీలు నమోదైంది. అయితే తెలంగాణ జిల్లాల్లో గురువారం సాయంత్రం నుంచి వాతావరణం మారిపోయింది.. వానలు పడ్డాయి. దీంతో ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది.

గత 24 గంటల్లో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి వానలు పడ్డాయి. రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌, నారాయణపేట, మహబూబ్‌నగర్, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలకు అవకాశం లేనప్పటికీ.. ప్రస్తుతం కురుస్తున్న ఈ వర్షాలు ఎండల తీవ్రత మధ్య ప్రజలకు కొంత ఉపశమనం కలిగిస్తాయని అంటున్నారు. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు విస్తరించినా ఆశించిన విధంగా వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ప్రస్తుతం అల్పపీడనం ప్రభావంతో పడుతున్న వర్షం వ్యవసాయ పనులకు ఊతమిచ్చే అవకాశం ఉంది అంటున్నారు. మొత్తం మీద తెలంగాణలో అల్పపీడన ప్రభావంతో వాతావరణం మారింది.

 

  Last Updated: 17 Jul 2026, 09:49 AM IST