Site icon HashtagU Telugu

Anganwadi Buildings: భారీ వర్షాలకు అంగన్వాడీ భవనాలకు నష్టం.. మంత్రి సీతక్క కీల‌క‌ ఆదేశాలు!

Anganwadi Buildings

Anganwadi Buildings

Anganwadi Buildings: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా అంగన్వాడీ కేంద్రాలకు (Anganwadi Buildings) తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా పాత, బలహీనమైన భవనాల్లోని అంగన్వాడీలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. ఈ సమస్యపై మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెంటనే స్పందించి, అధికారులకు సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు అధికారులు నష్టం అంచనాలను రూపొందించి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు.

ఈ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 580 అంగన్వాడీ భవనాలు వర్షాల ప్రభావంతో దెబ్బతిన్నాయి. ఇందులో సొంత భవనాల్లో నడుస్తున్న 440 కేంద్రాలు, అద్దె రహిత భవనాల్లో నడుస్తున్న మరో 140 కేంద్రాలు ఉన్నాయి. ఈ భవనాలకు పైకప్పు లీకేజీలు, గోడలు, బేస్‌మెంట్లలో పగుళ్లు, ఫ్లోర్ దెబ్బతినడం వంటి సమస్యలు ఎక్కువగా తలెత్తాయి.

అత్యధికంగా నష్టం వాటిల్లిన జిల్లాలు

కొన్ని జిల్లాల్లో ఈ నష్టం అధికంగా ఉంది. నిర్మల్ జిల్లాలో 100కు పైగా, భద్రాద్రి కొత్తగూడెంలో 75, కామారెడ్డిలో 49, గద్వాలలో 40, హనుమకొండలో 25, మెదక్‌లో 25, వనపర్తిలో 22, ఆసిఫాబాద్‌లో 20, ములుగులో 20 అంగన్వాడీ భవనాలు దెబ్బతిన్నాయి. ఈ భవనాల మరమ్మతులకు భారీగా నిధులు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. సొంత భవనాలకు రూ. 14 కోట్లు, అద్దె రహిత భవనాలకు రూ. 3 కోట్లు ఖర్చవుతాయని లెక్కగట్టారు.

Also Read: CM Chandrababu: బెస్ట్‌ సీఎంగా చంద్రబాబు.. అంతకంతకూ పెరుగుతున్న గ్రాఫ్‌!

సరుకుల నష్టం, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

కొన్ని కేంద్రాల్లో వర్షపు నీరు లోపలికి రావడంతో బియ్యం, పప్పులు, నూనె, పాల డబ్బులు, స్టడీ మెటీరియల్ వంటి ముఖ్యమైన సరుకులు తడిసిపోయాయి. ఈ పరిస్థితిపై మంత్రి సీతక్క అధికారులకు కొన్ని ముఖ్యమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదకరంగా మారిన భవనాల్లోని అంగన్వాడీ సేవలను తక్షణం నిలిపివేయాలని, సమీపంలోని ప్రభుత్వ భవనాలు లేదా పాఠశాల ప్రాంగణాల్లో కేంద్రాలను తాత్కాలికంగా తరలించాలని సూచించారు.

అలాగే తడిసిపోయిన సరుకుల బదులు కేంద్రాలకు వెంటనే కొత్త సరుకులను సరఫరా చేయాలని స్పష్టం చేశారు. పిల్లల పోషకాహారం, ఆరోగ్యం, విద్యకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలని ఆమె హితవు పలికారు. ఈ ఆదేశాలన్నీ క్షేత్ర స్థాయిలో నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఈ సమస్యను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని పిల్లలకు సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తోంది.