Site icon HashtagU Telugu

Rain : హైదరాబాద్ భారీ వర్షం..రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి

Heavy Rainfall

Heavy Rainfall

తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో మేఘాల దండయాత్ర కొనసాగుతోంది. నేడు మధ్యాహ్నం వరకు మండు ఎండలు కురిపించిన ఆకాశం, సాయంత్రం 6 గంటల సమయంలో పూర్తిగా మేఘావృతమై ఒక్కసారిగా భారీ వర్షాన్ని కుమ్మరించింది. బంజారాహిల్స్, ఖైరతాబాద్, మాదాపూర్, నార్సింగి, ఎల్‌బీనగర్ వంటి ప్రాంతాల్లో కుండపోత వర్షం కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Paragon : 50వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న పారగాన్

ఈ వర్షాలకు కారణంగా రాష్ట్రంలో గల వాతావరణ మార్పులు కీలకంగా నిలుస్తున్నాయి. గల్ఫ్‌ ఆఫ్ మన్నార్‌ వరకు ఉన్న ద్రోణి ప్రభావంతో దక్షిణ, నైరుతి గాలులు రాష్ట్రంపై ప్రభావం చూపుతున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం వచ్చే రెండు రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ఉదయం వేళల్లో ఎండలు, సాయంత్రం వర్షాలు పడటంతో ప్రజలు మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పడుతున్నారు.

హైదరాబాద్‌తో పాటు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట వంటి జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అదే సమయంలో రాష్ట్ర ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో రానున్న మూడు, నాలుగు రోజులలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.