Heavy Rain : హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం.. ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ అంత‌రాయం

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తుంది. దీంతో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులకు

  • Written By:
  • Publish Date - July 18, 2023 / 09:12 PM IST

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తుంది. దీంతో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులకు గుర‌వుతున్నారు. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే వారు భారీ వ‌ర్షం కార‌ణంగా ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. మాదాపూర్‌, మెహిదీపట్నం, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంత‌రాయం ఏర్ప‌డింది. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రద్దీని పోలీసులు క్లియ‌ర్ చేస్తున్నారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీరు ప్రవహించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్‌తో రాష్ట్రంలోని అనేక జిల్లాలు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, రాజన్న-సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, ములుగు జిల్లాలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణశాఖ తెలిపింది. భారీ వర్షాల కారణంగా స్థానికంగా వరదలు వ‌చ్చే అవకాశం ఉన్నందున ఈ ప్రాంతాల నివాసితులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. మహబూబ్‌నగర్, వనపర్తి, రంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట, హైదరాబాద్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి, మేడ్చల్-మల్కాజిగిరి, జనగాం, సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో వర్షపాతం తీవ్రత పైన పేర్కొన్న జిల్లాల కంటే తక్కువగా ఉంటుందని వాతావ‌ర‌ణ‌శాఖ అంచ‌నా వేస్తుంది. అదే విధంగా నారాయణపేట, జోగుళాంబ గద్వాల్, నాగర్‌కర్నూల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.