Site icon HashtagU Telugu

Heavy Rains : హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం..ప‌లు ప్రాంతాల్లో నిలిచిన వ‌ర‌ద నీరు

Hyd Rains

Hyd Rains

హైదరాబాద్ నగరంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్ల‌పై వ‌ర‌ద నీరు నిలిచిపోవ‌డంతో వాహనాల రాకపోకలకు ఆటంకం క‌లిగింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, యూసుఫ్‌గూడ, మణికొండ, టోలీచౌక్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అలాగే షేక్‌పేట, నార్సింగి, మెహిదీపట్నం, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అయితే హైదరాబాద్‌లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని, బయటకు రావద్దని సూచించారు.

భారీ వర్షం కారణంగా జీహెచ్‌ఎంసీ అధికారులు సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశారు. ఏమైనా సమస్యలుంటే టోల్ ఫ్రీ నంబర్ 040-29555500లో సంప్రదించాలని అధికారులు సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. వడగళ్ల వాన, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం రైతులను అతలాకుతలం చేసింది. అకాల వర్షాల కారణంగా పంటలు భారీగా దెబ్బతిన్నాయని, అన్నదాతలకు లాభం లేకుండా పోయిందని చెబుతున్నారు.విదర్భ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం తెలంగాణ, కర్నాటక మీదుగా కొనసాగుతున్నందున మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 8 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.