Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించి చాలా రోజులు అవుతున్నా ఆ స్థాయిలో మాత్రం వర్షాలు పడటం లేదు. ఫలితంగా ఎండ, ఉక్కపోత, వేడి అలాగే ఉన్నాయి. అయితే నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా విస్తరిస్తుండటంతో వర్షాలు పడటం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్‌తో రాష్ట్రంలో 7 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తాజాగా ఒక ప్రకటనలో వెల్లడించింది. మరీ ముఖ్యంగా […]

Published By: HashtagU Telugu Desk
Heavy rain forecast for Telangana.

Heavy rain forecast for Telangana.

నైరుతి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశించి చాలా రోజులు అవుతున్నా ఆ స్థాయిలో మాత్రం వర్షాలు పడటం లేదు. ఫలితంగా ఎండ, ఉక్కపోత, వేడి అలాగే ఉన్నాయి. అయితే నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా విస్తరిస్తుండటంతో వర్షాలు పడటం లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్‌తో రాష్ట్రంలో 7 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తాజాగా ఒక ప్రకటనలో వెల్లడించింది. మరీ ముఖ్యంగా ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వానలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఇక.. ఇవాళ ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే ఆ రెండు ఉమ్మడి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, జనగాం, ములుగు.. నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, కుమురం భీమ్ ఆసిఫాబాద్‌, మేడ్చల్ మల్కాజిగిరి, మంచిర్యాల, రంగారెడ్డి, సంగారెడ్డి, వరంగల్‌, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.

ఈ క్రమంలోనే గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వర్షాలు, గాలుల పట్ల జనం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. ఇక.. హైదరాబాద్‌లో ఇవాళ మధ్యాహ్నం తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సాయంత్రం 6 గంటల తర్వాత హైదరాబాద్‌లో వర్షం తీవ్రత పెరుగుతుందని వెల్లడించారు. ఇక రాత్రి వేళ భారీ వర్షాలు నగరంలో కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మరోవైపు.. హైదరాబాద్‌లో వాతావరణం చల్లబడింది. దీంతో నిన్న మొన్నటి వరకు వేడి, ఉక్కపోతతో ఇబ్బంది పడిన ప్రజలు సేద తీరుతున్నారు. ఈ క్రమంలోనే లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండే చోట, ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉండటంతో ప్రజలు అత్యవసరం అయితే బయటికి రావాలని.. ముందుగానే ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జూలై 2వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఉత్తర, మధ్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని.. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

 

  Last Updated: 27 Jun 2026, 04:07 PM IST