Site icon HashtagU Telugu

Rain Alert : హైదరాబాద్‌కు భారీ వర్షసూచన.. ఉత్తరాంధ్రలోనూ తేలికపాటి జల్లులు

Rain Alert Today

Rain Alert : ఇవాళ  హైదరాబాద్ నగరానికి భారీ వర్ష సూచన ఉందని భారత వాతావరణ విభాగం (IMD)  తెలిపింది. ప్రత్యేకించిన నగరంలోని చార్మినార్, మలక్ పేట్, మెహదీపట్నం, ఆరాంఘర్, నాంపల్లి, దిల్‌సుఖ్ నగర్, ఎల్బీ నగర్, సైదాబాద్, రాజేంద్ర నగర్, గోల్కొండ, గచ్చిబౌలి, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని చెప్పింది. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటం, ప్రస్తుతం నెలకొన్న విభిన్న వాతావరణ పరిస్థితులు కలగలసి భారీ వర్షానికి(Rain Alert) దారితీయొచ్చని ఐఎండీ వివరించింది. హైదరాబాద్‌లో వాతావరణంలో తేమ 48 శాతం ఉంది. అయితే నగరంలో గాలి వేగం ఎక్కువగానే ఉన్నందువల్ల  వాతావరణంలో అకస్మాత్తుగా ఎలాంటి మార్పులైనా జరిగే ఛాన్స్ ఉంది.

We’re now on WhatsApp. Click to Join

ప్రస్తుతం మహారాష్ట్ర – కేరళ సముద్ర తీరాలపై ద్రోణి ఉందని వెల్లడించింది. ఈ కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలుచోట్ల  ఈనెల 24 నుంచి 28 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వివరించింది. కొన్ని సముద్రతీర ప్రాంతాల్లో గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఉంటుందని ఐఎండీ పేర్కొంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల తర్వాత కోస్తా, ఉత్తరాంధ్రలో, అనంతపురం, రాయదుర్గంలో, పాలకొల్లులో వర్షసూచన ఉందని ఐఎండీ చెప్పింది. సాయంత్రం 5 గంటల తర్వాత ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల వాన పడుతుందని వెల్లడించింది. రాత్రి 7 గంటల తర్వాత ఉత్తరాంధ్రలోని పలుజిల్లాల్లో తేలికపాటి వర్షం పడొచ్చని అంచనా వేసింది. బంగాళాఖాతంలో గంటకు 25 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తున్నా.. అది నేరుగా ఏపీలోకి రావట్లేదు. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర మీదుగా గాలులు ఏపీ, తెలంగాణలోకి వస్తున్నాయి. ఇవాళ ఏపీ తీర ప్రాంతాల్లో కొంత వేడి ఉంటుంది. ఉష్ణోగ్రత ఏపీలో యావరేజ్‌గా 36 డిగ్రీల మేర, తెలంగాణలో 32 డిగ్రీల మేర ఉండొచ్చు. ఉక్కపోత ఫీలింగ్ తక్కువగానే ఉంటుంది.