Local Body Elections 2025 : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి ? అనే దానిపై రాజకీయ వర్గాల్లో వాడివేడి చర్చ జరుగుతోంది. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్తు పోల్స్ ఫిబ్రవరి నెలాఖరులో జరుగుతాయని కొందరు అంచనా వేస్తుండగా.. ఏప్రిల్ నాటికి జరుగుతాయని ఇంకొందరు అంటున్నారు. దీంతో ఇంతకీ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై డైలమా నెలకొంది.
Also Read :Car Handling Charges : వాహన షోరూంలలో హ్యాండ్లింగ్ ఛార్జీల పేరిట దోపిడీ.. ఎలా అంటే ?
బీసీ రిజర్వేషన్ల పెంపుతో చిక్కు..
ఇటీవలే గాంధీభవన్‌లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘‘స్థానిక సంస్థలకు ఎన్నికలు త్వరగా జరపాలి. ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయింది. కార్యకర్తలు, స్థానిక నాయకత్వాలనూ కాస్త పట్టించుకోవాలి’’ అని చెప్పారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెలాఖరులోగా గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్తులకు ఎన్నికలు నిర్వహిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి మూడో వారంలో మూడు విడతలుగా గ్రామ పంచాయతీలకు, నాలుగో వారంలో ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతాయనే టాక్ వినిపిస్తోంది. అయితే ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం చిక్కుముడిగా మారిందని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. వాస్తవానికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు(Local Body Elections 2025) 50 శాతానికి మించొద్దని సుప్రీంకోర్టు తీర్పు ఉంది.ఈ నేపథ్యంలో కులగణన సర్వే నివేదికను పరిగణనలోకి తీసుకుని బీసీల రిజర్వేషన్‌ను 42 శాతానికి పెంచుకునేలా అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ సర్కారు కోరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్లమెంటులో చట్టం చేయాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపనున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం ఇందుకు అనుమతించకపోతే, స్థానిక ఎన్నికల్లో రేవంత్ సర్కారు ఏ వైఖరి అవలంబిస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది.
Also Read :Mouth Wash: మీరు మౌత్ వాష్ వాడుతున్నారా? క్యాన్సర్ పట్ల జాగ్రత్త వహించండి
ఆ నాలుగు పథకాలకు నిధులు లేనందున..
జనవరి 26 నుంచి రైతులకు రైతు భరోసా, భూమిలేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డుల మంజూరు కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేయనుంది. అయితే ఈ పథకాలకు పూర్తిస్థాయిలో నిధులు సమకూరడం సాధ్యమవుతుందా? అనే దానిపై చర్చ జరుగుతోంది. నిధుల కొరత వల్ల ఈ నాలుగు పథకాలు అసంపూర్ణంగా అమలైతే కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో నెగెటివ్ ఫీలింగ్ ఏర్పడే ముప్పు ఉంది. అందుకే ఈ పథకాలు పూర్తి స్థాయిలో అమలైన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ సర్కారు యోచిస్తోందట. ఏప్రిల్ లేదా మే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు.