Family Planning Operation: కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిన డాక్టర్ లైసెన్స్ రద్దు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సామాజిక ఆరోగ్య, పౌష్టికాహారం కేంద్రంలో కుటుంబ నియంత్రణ చేసి నలుగురు మృతికి కారణమైన డాక్టర్ లైసెన్స్ ను.....

  • Written By:
  • Updated On - August 31, 2022 / 03:45 PM IST

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సామాజిక ఆరోగ్య, పౌష్టికాహారం కేంద్రంలో కుటుంబ నియంత్రణ చేసి నలుగురు మృతికి కారణమైన డాక్టర్ లైసెన్స్ ను రద్దు చేయడంతోపాటు ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేసినట్లు వైద్యఆరోగ్యశాఖా మంత్రి హరీష్ రావు తెలిపారు. విచారణ కమిటీ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
నిమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన ఈ రోజు పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నలుగురు మహిళలు చనిపోవడం దురదృష్టకరమన్నారు. వారు ఇన్ఫెక్షన్ వల్ల మరణించినట్టు ప్రాథమికంగా తెలిసిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రకటించారు. ఆస్పత్రిలో బాధితులకు ఉచితంగా చికిత్స చేయిస్తున్నామని, వారి సహాయకులకు రూ.10 వేలు అందించనున్నట్లు తెలిపారు.

నిమ్స్‌లో 17 మంది, అపోలో ఆస్పత్రిలో 13 మంది మహిళలు చికిత్స పొందుతున్నారని, వారంతా సురక్షితంగా ఉన్నారని వివరించారు. ఈ రోజు కొంతమంది, రేపు కొంత మంది, రెండు మూడు రోజుల్లో అందరూ డిశ్చార్జ్‌ అవుతారన్నారు. తాము రాజకీయాలు చేయం అని, ప్రజల ప్రాణాలు కాపాడతామని చెప్పారు. ఆరోగ్య అధికారులు ఇక్కడే ఉన్నారని, గంటగంటకు మానిటరింగ్ చేస్తున్నట్లు తెలిపారు.ఇక ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. ఏడేళ్లలో 12 లక్షల కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసినట్లు హరీష్ రావు తెలిపారు.