Site icon HashtagU Telugu

Cyber Crime: ఉచితంగా వస్తోందని వైఫై వాడాడు.. ఓ యువకుడి పరిస్థితి ఏమైందంటే..!

6 Reasons Why Cyber Crime 700x400.jpg.optimal

6 Reasons Why Cyber Crime 700x400.jpg.optimal

Cyber Crime: రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, షాపింగ్‌ మాల్స్‌.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉచితంగా వైఫై ప్రొవైడ్‌ చేస్తుంటారు. చాలా మంది వినియోగదారులు వీటిని ఉపయోగించుకుంటూ ఉంటారు. అయితే, తాజాగా జరిగిన ఓ ఘటన గురించి తెలుసుకుంటే ఇక పబ్లిక్‌ ప్లేసుల్లో ఎప్పుడూ వైఫై వాడేందుకు సాహసించరు. ఓ యువకుడు ఫ్రీగా వైఫై వస్తోందని వాడి 50 వేల రూపాయలు పోగొట్టుకున్నాడు.

కొందరు యువత తమ మొబైళ్లలో డేటా బోలెడంత ఉన్నప్పటికీ ఫ్రీ వైఫై కోసం తహతహలాడుతుంటారు. ఫ్రీగా దొరికితే తెగ వాడేస్తుంటారు. ఇలా వాడినందుకు ఓ యువకుడికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్‌లోనే జరగడం గమనార్హం. ఉద్యోగం కోసం గ్రూప్స్‌కు ప్రిపేర్‌ కావడానికి నగరానికి వచ్చిన కుమార్‌.. గ్రూప్స్ కోచింగ్ కోసం ఒక ఇన్‌స్టిట్యూట్‌లో చేరేందుకు, కుటుంబసభ్యులు అతనికి ఆన్‌లైన్‌లో డబ్బు పంపించారు.

ఈ క్రమంలో అకౌంట్‌లో డబ్బులు పెట్టుకొని నగరంలో అలా విహరిద్దామని వెళ్లాడు. ఓ షాపింగ్‌ మాల్‌ వద్దకు చేరిన ఆ యువకుడికి ఫ్రీ వైఫై సిగ్నల్‌ కనిపించింది. ఇంకేముందీ.. డేటా ఆఫ్‌ చేసి ఉచిత వైఫై వాడటం మొదలు పెట్టాడు. కాసేపు బాగానే అనిపించింది. కాసేపయ్యాక అతని ఫ్యూజులు ఎగిరిపోయే మెసేజ్‌లు వచ్చాయి. అతని బ్యాంక్ అకౌంట్ నుంచి ఏకంగా రూ.50 వేలు మాయమైపోయినట్లు సందేశాలు వచ్చాయి.

ఖంగుతిన్న యువకుడు.. పోలీసులకు ఫిర్యాదు..
ఒక్కసారిగా ఈ పరిణామం చోటు చేసుకోవడంతో యువకుడు ఖంగు తిన్నాడు. వెంటనే షాపింగ్‌మాల్‌ వాళ్లను సంప్రదించి ఇదేంటని నిలదీశాడు. ఫ్రీ వైఫై ఆశ చూపించి డబ్బు లాగేస్తారా? ఇదెక్కడి అన్యాయం.. అంటూ ఆక్రోశం వ్యక్తం చేశాడు. దీంతో వారు రివర్స్‌ పంచ్‌ ఇచ్చారు. అసలు తమ మాల్‌కి ఫ్రీ వైఫై యాక్సెస్ లేదని స్పష్టం చేయడంతో యువకుడికి మైండ్‌ బ్లాక్‌ అయినంత పనైంది. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సైబర్‌ నేరాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నా.. ఇలాంటి నేరాలు చోటు చేసుకోవడం పోలీసులకు తలనొప్పిగా మారుతోంది.

Exit mobile version