MLC Kavitha: అమిత్ షా కాదు.. అబద్దాల బాద్ షా: కోరుట్ల ప్రచారంలో కల్వకుంట్ల కవిత

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

  • Written By:
  • Publish Date - November 25, 2023 / 01:29 PM IST

MLC Kavitha: కోరుట్ల: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన పేరు అమిత్ షా కాదని, అబద్దాల బాద్ షాగా మార్చుకోవాలని అన్నారు. కోరుట్లకు వచ్చి షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని అమిత్ షా అన్నారని, ఎయిర్ ఇండియా వంటి పెద్దపెద్ద ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసిన బీజేపీ ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తదటా అని ఎద్దేవా చేశారు. అమిత్ షా ప్రకటన కనీసం నమ్మేటట్టు ఉందా అని అడిగారు. బోధన్ షుగర్ ఫ్యాకర్టీని ముంచిందే బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు అని, కోర్టుల్లో కేసులు వేసి అనేక ఇబ్బందులు పెట్టారని విమర్శించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుట్ల టౌన్ లో నిర్వహించిన రోడ్ షో లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ తో కలిసి కవిత గారు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… ఢిల్లీ నుంచి ప్రధాని మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వంటి వాళ్లు బయటి వచ్చి కుటుంబ పాలన గురించి మాట్లాడుతున్నారని, తమది నలుగురితో కూడిన కుటుంబం కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలతో కూడిన కుటుంబమని తేల్చిచెప్పారు. తెలంగాణ కుటుంబంలోకి వచ్చి ఆ నాయకులు వైరుధ్యాలు సృష్టించలేరని, గొడవపెట్టలేరని సూచించారు. కాంగ్రెస్ హయాంలో ఎప్పుడూ అల్లర్లు జరిగేవని, గత పదేళ్లో ఎటాంటి అల్లర్లు లేకుండా సీఎం కేసీఆర్ పరిపాలన చేశారన్నారు.

మనం అభివృద్ధి వైపు ఉందామా లేదా అరాచకం వైపు ఉందామా ? అన్నది తేల్చుకోవాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చెప్పింది ఎప్పుడూ చేయలేదని, కాబట్టి ఆ రెండు పార్టీల మాటలను నమ్మి మోసపోవద్దని కోరారు. వాట్సప్ లో ఆ పార్టీలు అనేక దుష్ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని, 2.32 వేల ఉద్యోగాలను ప్రకటించామని, 1.6 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే భర్తీ అయ్యాయని గుర్తు చేశారు. న్యూయార్క్ ఎలా ఉందో హైదరాబాద్ అలా అయ్యిందని, పెద్ద పెద్ద బహుళజాతి కంపెనీలు హైదరాబాద్ కు వస్తున్నాయని, ప్రైవేటు రంగంలో దాదాపు 30 లక్షల మందికి ఉద్యోగాలను కల్పించామని చెప్పారు. ప్రజల్లో ఉండి ప్రజల కోసం నిర్విరామంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్ కు మద్ధతివ్వాలని పిలుపునిచ్చారు.

ఎన్నికలు వచ్చినప్పుడు ఇతర పార్టీలు వచ్చి రకరకాల మాటలు మాట్లాడుతాయని, కానీ ఎవరు మంచి చేస్తున్నారో ఆలోచించాలని కోరారు. తెలంగాణ వచ్చిన నాటికి 10 ఉమ్మడి జిల్లాల్లో 9 వెనుకబడిన జిల్లాలు ఉండేవని, గల్ఫ్ కు వలస వెళ్లే పరిస్థితులను చూశామని చెప్పారు. బీడీ కార్మికులతో సహా అన్ని రకాల పెన్షన్లను రూ. 5 వేలకు పెంచాలని, కటాఫ్ డేట్ తో సంబంధం లేకుండా బీడీ కార్మికులందరికీ పెన్షన్లు ఇవ్వాలని, పేద మహిళలకు సౌభాగ్య లక్ష్మీతో నెలకు రూ. 3 వేల పెన్షన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ సంకల్పించారని వివరించారు. రేషన్ కార్డులను సరిదిద్ది కొత్త కార్డులు జారీ చేసిన తర్వాత రైతు బీమా తరహాలో పేదలకు రూ. 5 లక్షల మేర కేసీఆర్ రక్ష పేరిట బీమా పథకాన్ని అమలు చేస్తామని, రూ. 15 లక్షల వరకు ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య చికిత్స చేయించుకునే సౌకర్యాన్ని కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తుందన్నారు. గతంలో ఇటువంటి మానవత కలిగిన ప్రభుత్వాలను చూశారా అని అడిగారు.

కేంద్రంలో నరేంద్ర మోడి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉప్పు, పప్పు, మంచినూనె, ఉల్లిగడ్డ వంటి అన్ని నిత్యవసర సరుకుల ధరలు పెరిగాయని విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం రూ. 2 వేల పెన్షన్ ఇస్తుంటే అందులో రూ. 1200 గ్యాస్ సిలిండర్ కే పోతున్నాయని, కాబట్టి గ్యాస్ సిలిండర్ ధర భారాన్ని తగ్గించడానికి సీఎం కేసీఆర్ రూ. 400 కే అందించాలని నిర్ణయించారని తెలిపారు. ఎన్ని సార్లు సీఎం కేసీఆర్ డిమాండ్ చేసినా కేంద్ర ప్రభుత్వం తగ్గించలేదని, దాంతో తామే తగ్గించి పేదలపై భారం తగ్గించాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. కోరుట్లలో వెయ్యి ఫాట్లను ఇస్తామని, ఇళ్ల స్థలాలు ఉన్నవారికి ఇళ్ల నిర్మాణం కోసం గృహ లక్ష్మి కింద రూ. 3 లక్షలు ఇస్తామని చెప్పారు. కార్తుకు ఓటేసి సంజయ్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Also Read: IT Rides : బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు.. భారీగా నగదు లభ్యం