Site icon HashtagU Telugu

HCU: ఈ’ స్టేట్ ‘మనదిరా! ఈ’ భూమి’ మనదిరా!!

Hcu Government Land

Hcu Government Land

”ఎంతో ఓర్పుగా,నిశ్శబ్దంగా డేగ ఎత్తైన ఆకాశంలో గుండ్రంగా తిరుగుతూ,తన వాడి చూపులతో అంతటా చూస్తుంటుంది.కింద భూమీద ఉన్న వాటికి తమ కదలికలను ఎవరో గమనిస్తున్నట్టు తెలియదు. సరయిన క్షణాన హఠాత్తుగా డేగ ఎదురు లేనంత వేగంగా కిందకు దూసుకు వస్తుంది.చంపబడే జంతువు ఏమి జరుగుతుందో గ్రహించే లోపున,ఉక్కు పళ్ళ లాంటి గోళ్ళతో డేగ దాన్ని పైకి,ఆకాశానికి ఎగరేసుకుపోతుంది”అని 1769 – 1821 కాలానికి చెందిన నెపోలియన్ అన్నాడు.

ఈ డేగ కథ ఎందుకంటే,2014 నుంచి తెలంగాణలో కొన్ని’డేగలు’ భూ వనరులను ఎలా ఎగరేసుకుపోయారో ఇప్పుడు చర్చ జరుగుతోంది కనుక. 2001 నుంచే ఒక ‘సామాజికవర్గం’ డేగలు హైదరాబాద్ నగరం,దాని చుట్టుపక్కల ఉన్న భూములు,ఇతర ప్రకృతి సంపదపై కన్నేశాయి.వాటిని ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే’ ఎలా కొల్లగొట్టాలో పధ్నాలుగేండ్ల పాటు ఆ సామాజికవర్గ ప్రముఖులు పరిశోధించి,స్కాన్ చేసి,ఒక బ్లూప్రింట్ తయారు చేసుకొని పెట్టుకున్నట్టు అనుమానాలు కలుగుతున్నవి.’విహంగ’ వీక్షణంతో మొత్తం భూ సంపదను,ఎలా స్వాహా చేయవచ్చునో ఒక ‘రోడ్ మ్యాపు’ సిద్ధం చేసుకున్నట్టు తెలియవచ్చింది.అభివృద్ధి పేరిట చంద్రబాబు నాయుడు హయాంలో ‘టెర్రరిజాని’కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఒక ప్రయోగశాలగా మార్చారన్న ఆరోపణలున్నాయి.నగరాన్ని నంజుకు తినడానికి వీలుగా చంద్రబాబు, వలసవాదులకు వెసులుబాటు ఇచ్చారన్న విమర్శలు కూడా ఉన్నాయి.తెలుగుదేశం పాలనలో రియల్ ఎస్టేట్ దొరలకు పండుగ వాతావరణం ఉండేది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను దోచుకుతినడానికి అంతర్జాతీయ సంస్థలు,కంపెనీలకు తలుపులు బార్లా తెరిచారన్న విమర్శలు వచ్చాయి.

‘మా వనరులు మావె.మా భూములు మాకే.మా ఉద్యోగాలు మాకే.మా నీళ్లు మావే’ అనే నినాదమే ఏపీ విభజనకు పునాది.తెలంగాణ రాష్ట్రం అవతరించినప్పుడు ఆ నినాదం నిజమవుతుందని ప్రజలు భావించారు.కానీ అందుకు భిన్నంగా కోస్తాఆంధ్ర పెట్టుబడిదారీ వర్గానికి పాలకవర్గం మోకరిల్లడం ఆశ్చర్యకర పరిణామం.’ఈ స్టేట్ మనదిరా ! ఈ భూమి మనదిరా!’ అనే ధోరణిలో ఒక సామాజికవర్గం పట్టపగ్గాలు లేకుండా ఎలా రెచ్చిపోయిందో ప్రజల అనుభవంలో ఉన్నది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్న సందర్భంలో డ్రోన్ ఎగురవేసిన సంఘటన జరగకపోతే ‘జన్వాడ ఫార్మ్ హౌజ్’ సంగతే ఎవరికీ తెలిసేది కాదు.ఇలా ఎక్కడెక్కడ సహజవనరులను నిర్దాక్షిణ్యంగా కొల్లగొట్టారో
బాహ్య ప్రపంచానికి తెలియదు.మింగివేసిన భూములు వేల ఎకరాలు అని కొందరు,లక్షలాది ఎకరాలు అని మరికొందరు చెబుతున్నారు.కొందరు ప్రముఖులు ఆరేడు తరాలకు సరిపోయే సంపదను కూడబెట్టుకున్నట్టు ఆరోపణలున్నవి.తెల్ల రేషన్ కార్డు,ఒక టూ వీలర్ ఉన్న వ్యక్తులు బెంజ్ కార్లలో తిరుగుతున్న దృశ్యాలు నగరంలో కనిపిస్తున్నవి.

సెంట్రల్ యూనివర్సిటీ భూముల పేరిట జరుగుతున్న వివాదంపై ‘గుంట నక్కల’ ప్రస్తావన’ ను అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి తీసుకువచ్చినప్పుడు చాలామందికి వెంటనే అర్ధం కాలేదు.నిజాలు నెమ్మదిగా వెలుగు చూస్తున్నాయి.ఒక ‘గుంట నక్క’ సంగతి తేలిపోయింది.ఇంకా అలాంటి ఎన్ని ‘గుంట నక్కలు’ ఆ ప్రాంతాల్లో మోహరించి ఉన్నాయో తెలియవలసి ఉన్నది.హైదరాబాద్ నగరాన్ని పంటికి అందకుండా మింగివేసిన,నంజుకు తిన్న వ్యక్తులు ఈ మాఫియాలో సూత్రధారులు.వాళ్ళు దాదాపు లక్షలాది భూములను ‘ధరణి’ పేరిట కైంకర్యం చేసినట్టు గతంలో ఆరోపణలు వచ్చాయి.వాళ్ళే సెంట్రల్ యూనివర్సిటీ వివాదాస్పద భూములను తమ ‘ఇంటి పార్టీ’ మద్దతుదారులకు,పోషకులకు అప్పనంగా అప్పజెప్పే ప్రక్రియకు పునాది రాయి వేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి.’మా రాష్ట్రం – మా భూమి – మా ఇష్టం’ అనే పద్దతిలో, ‘ప్రత్యేక తెలంగాణ’ సాధకుల ముసుగులో ఒక ‘సామాజికవర్గాని’కి భారీ ప్రయోజనం చేకూర్చే పాపానికి ఒడిగట్టినట్టు కనిపిస్తున్నది.

400 ఎకరాల కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం బిఆర్ఎస్ మెడకు చుట్టుకున్నది.ఈ భూముల అమ్మకానికి ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున ఆయనను అప్రదిష్ట పాల్జేయాలనే ‘పథకాన్ని’ బిఆర్ఎస్ అమలు చేస్తున్నది.అయితే ఆ పార్టీయే ‘అసలు దోషి’ అని ఆరోపణలు వెల్లువెత్తడం సంచలన సంఘటన.ఈ విలువైన భూమి యూనివ‌ర్సిటీకి చెందిన‌ద‌ని,వేలం పాట‌లో విక్ర‌యించ‌వ‌ద్ద‌ని విద్యార్థుల‌తో పాటు బీఆర్ఎస్‌ బీజేపీ ఆందోళ‌న‌ సాగిస్తున్నవి.రేవంత్ ప్రభుత్వాన్ని సమాజంలో డ్యామేజ్ చేయడానికి రెండు పార్టీలు విద్యార్థుల‌ను రాజ‌కీయ రొంపిలోకి దింపడం తాజా పరిణామం.

సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ భూముల పేరిట జరుగుతున్న వివాదంలో తెర వెన‌క సూత్ర‌ధారులు,పాత్ర‌దారులు,కుట్ర‌దారులు చేతులు క‌లిపినట్టు సమాచారం అందుతోంది.ప‌దేళ్ల బీఆర్ఎస్ పాల‌న‌లో రియ‌ల్ ఎస్టేట్ ‘మాఫియా’ను పెంచిపోషించిన నాయకులే ఈ గొడ‌వ‌ల‌కు కారణమని ప్రభుత్వం నిర్ధారణకు వస్తోంది.ఈ కుట్ర‌ల‌ను తెలంగాణ స‌మాజం తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉందని కాంగ్రెస్ నాయకులంటున్నారు. 2014లో ప్ర‌త్యేక రాష్ట్రంలో అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ పార్టీ కన్ను భూములపై పడినట్టు విమర్శలున్నవి.

తమ సామాజిక వర్గానికి ఆయా భూములను కట్టబెట్టే కార్యక్రమానికి ‘కేసీఆర్ పరివార’మంతా ప్రయత్నించినట్టు ప్రభుత్వం వివరాలు బయటపెట్టింది. ఈ భూముల‌పై వివాదం న‌డుస్తుండ‌గానే అప్ప‌టి ముఖ్య‌మంత్రి కేసీఆర్‌,మునిసిప‌ల్ మంత్రి కేటీఆర్ 25 ఎక‌రాలు ‘మై హొమ్’ గ్రూపు సంస్థల అధిపతి జూపల్లి రామేశ్వ‌ర్ రావుకు ‘వేలం’లో స్వాధీనమయ్యేలా చేశారన్న ఆరోపణలు వస్తున్నవి.ఈ భూమిలోనే ‘మై హోం విహంగ’ పేరుతో బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నం నిర్మాణం పూర్త‌యింది.ఈ బహుళ అంత‌స్తుల భ‌వ‌నం కోసం నాటి మంత్రి కేటీఆర్ వంద ఫీట్ల రోడ్డు కూడా వేయించారు.ఇంత‌టి విలువైన భూముల‌ను ‘మై హోం’ సంస్థ య‌జ‌మాని జూప‌ల్లి రామేశ్వ‌ర్ రావుకు ధారాదత్తం చేసిన‌ప్పుడు, బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌నాలు నిర్మించి వేల కోట్ల రూపాయ‌లు కూడ‌బెట్టుకున్న‌ప్పుడు కేటీఆర్‌కు, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డికి తెలియ‌దా అని ప్రభుత్వ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.అవి సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ భూములు అని,భ‌వ‌నాల రాక‌తో ప‌ర్యావ‌ర‌ణానికి హాని క‌లుగుతుంద‌ని,వ‌న్య‌ప్రాణుల‌కు ప్ర‌మాదం వాటిల్లుతుంద‌ని గ్ర‌హించ‌లేక‌పోయారా? అని అధికార పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.జూప‌ల్లి రామేశ్వ‌ర్ రావు ‘మై హోం విహంగ’ నిర్మాణం చేస్తున్న‌ప్పుడు ఎలాంటి నిరసన వ్యక్తం కాలేదు.ఇప్పుడా రెండు ప్రతిపక్ష పార్టీలు ఢిల్లీ దాకా వెళ్లాయి.రాజ్యసభలో బిఆర్ఎస్ సభ్యులు గాయత్రి రవిచంద్ర,సురేష్ రెడ్డి ప్రస్తావించారు.కొందరు విద్యార్థులు రాహుల్ గాంధీని కలిసి సీఎం రేవంత్ పై ఫిర్యాదు చేశారన్న ప్రచారం సాగుతోంది.

గ‌తంలో 25 ఎక‌రాల‌ను కేటాయించిన విధంగానే ఈ 400 ఎక‌రాల ‘కంచ గ‌చ్చిబౌలి భూముల‌’ను కూడా రామేశ్వ‌ర్ రావు,సహా మరికొందరు అదే ‘సామాజికవర్గాని’కి చెందిన మరికొందరు వ్యక్తులకు ద‌క్కాల‌నే ముందుచూపుతో బీజేపీ,బిఆర్ఎస్ కుమ్మక్కయి ధర్నాల‌కు దిగారని అంటున్నారు.ఇప్ప‌టికైనా మై హోం విహంగ నిర్మాణాల‌ను కూల్చివేయాల‌నే డిమాండ్ చేసే ద‌మ్ము, ధైర్యం కేంద్ర మంత్రులు బండి సంజ‌య్‌,జీ కిష‌న్ రెడ్డి తో పాటు కేటీఆర్ కు ఉందా? అని కాంగ్రెస్ నాయకులంటున్నారు.రేవంత్ రెడ్డికి దమ్ముంటే ‘మై హోమ్’ విహంగ బహుళ అంతస్థుల భవనాలను కూల్చివేయగలరా? అని ఎమ్మెల్సీ కవిత ఏప్రిల్ 2 న సవాలు చేశారు.అయితే కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చిఉంటే ఈ 400 ఎకరాల భూమిని ఎప్పుడో అమ్మేసేవారని అధికారవర్గాలంటున్నాయి.ఈ మేరకు గతంలోనే కంచ గచ్చిబౌలి భూముల అమ్మకానికి ‘స్కెచ్’ వేశారని ఆ వర్గాల ద్వారా తెలుస్తోంది.

కాగా ”ధరణి పోర్టల్ లో బ్రిటిష్ ఐల్యాండ్ కు సంబంధించిన పెట్టుబడులు ఉన్నాయి.’ధరణి’ కేటీఆర్ మిత్రుడు గాదె శ్రీధర్ రాజు చేతుల్లో ఉంది. దారిదోపిడీ దొంగలకంటే భయంకరమైన దోపిడీ జరిగింది.లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు మాయమయ్యాయి.ధరణి పోర్టల్ నిర్వహణ విదేశీయుల చేతుల్లోకి వెళ్లిపోయింది.అందరి వివరాలు విదేశీయుల గుప్పిట్లో ఉన్నాయి.ఇది అత్యంత ప్రమాదకరం” అని పీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి అప్పట్లో వ్యాఖ్యానించారు.ప్రభుత్వ భూములకు యజమానులను సృష్టించడం,అనంతరం ఆ భూములను బదలాయించడం,ఆ తర్వాత వాటిని లేఅవుట్లు వేసి అమ్ముకోవడం వంటి తతంగం పదేండ్ల కాలంలో సాఫీగా జరిగి పోయిందన్న విమర్శలున్నవి.అందుకే రేవంత్ ముఖ్యమంత్రి కాగానే ‘ధరణి’ని చెత్తబుట్టలో వేసి భూభారతిని తీసుకొచ్చారు.

ఇదిలా ఉండగా అభివృద్ధి,సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నా,ఐటి వంటి పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు కల్పించాలన్నా,ఆర్ధిక వనరులు సమకూర్చుకోవాలన్నా భూములు వేలం వేయక తప్పని పరిస్థితిలో రేవంత్ ప్రభుత్వం కూరుకుపోయింది.ఎప్పటి నుంచో ఈ తతంగం జరుగుతుంది.ఇది కొత్తేమీ దకాదు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అని విద్యార్థులు ఆందోళనకు దిగడం,దీనికి బీజేపీ,బిఆర్ఎస్ మద్దతు ప్రకటించడంతో సమస్య జఠిలమైంది.ప్రభుత్వానికి ఈ పరిణామాలు కొంత ఇబ్బందికరంగా మారాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ హెచ్.ఎం.డీ.ఏ పరిధిలోని భూములను విక్రయించడం,వేలం వేయడం ద్వారా వచ్చిన అదనపు ఆదాయాన్ని సమకూర్చుకున్నాయి.అదే ఒరవడిలో రేవంత్ ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమం చేబట్టింది.

ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున కేంద్రం నుంచి తగిన సహకారం అందడం లేదు.ప్రత్యేక నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే అవకాశాలు అసలే లేవు.ఇక ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రజలపై పన్నుల భారాన్ని పెంచితే ప్రభుత్వానికి చెడ్డపేరు రావడం ఖాయం.అలా చెడ్డ పేరు రావాలని,దాంతో ప్రజల్లో వ్యతిరేకతను ప్రభుత్వం మూటగట్టుకోవాలని బీజేపీ,బిఆర్ఎస్ బలంగా కోరుకుంటున్నవి.అందుకు ఉదాహరణే ధృవ్ రాఠీ వంటి ప్రపంచ ప్రఖ్యాత యూట్యూబర్ సహా పలువురు మేధావులు,సెలెబ్రిటీలు,పర్యావరణవేత్తలు,సినీ ప్రముఖులు సైతం సోషల్ మీడియాలో ‘సెంట్రల్ యూనివర్సిటీలో ప్రకృతి విధ్వంసం’ నిలిపివేయాలంటూ ప్రచారం చేస్తున్నారు.వీళ్లంతా తమంతట తాము హైదరాబాద్ లో ఏమి జరుగుతున్నదో తెలుసుకోగలిగిన సమాచార వనరులు ఉన్నవారు కాదు.

కేసీఆర్ పార్టీకి చెందిన సోషల్ మీడియా మేనేజర్లు పకడ్బందీగా రేవంత్ ను లక్ష్యంగా చేసుకొని కార్యకలాపాలు సాగిస్తున్నట్టు తెలుస్తోంది.ఇందుకు గాను పెద్దఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నట్టు కూడా తెలియవచ్చింది.రేవంత్ కు వ్యతిరేకంగా బిఆర్ఎస్ ‘ప్రచార యుద్ధాన్ని’ సమర్ధంగా నడుపుతున్నది.

ఇక, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైపు నుంచి కొన్నిలోపాలు హెచ్.సీ.యు.పరిణామాలలో బట్టబయలయ్యాయి.ఇలాంటి ‘సున్నితమైన’ వ్యవహారాన్ని అమలుచేయాలని తలపెట్టినప్పుడు !

1. సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్,టీజీఐఐసీ ఎం.డి,ప్రొఫెసర్లు హరగోపాల్,చక్రపాణి ఘంటా,నాగేశ్వర్,కోదండరాం,విద్యా కమిషన్ చైర్మన్ మురళి ఆకునూరి,సీనియర్ జర్నలిస్టులు కే.రామచంద్రమూర్తి,కె.శ్రీనివాస్,అమర్ దేవులపల్లి,కొందరు పర్యావరణ వేత్తలు,సామాజిక కార్యకర్తలు,లెఫ్ట్ పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాల ప్రతినిధులతో సీఎం సమావేశం జరిపి,వ్యూహరచన చేస్తే సమస్య ఇంత తీవ్రమయ్యేది కాదు.

2.ప్రభుత్వ నిర్ణయం ఎంత హేతుబద్దమైనదో ప్రజల్ని కన్విన్సు చేయగలిగిన మెకానిజం ఏర్పరుచుకోలేదు.

3.తనకు వ్యతిరేకంగా బీజేపీ,బిఆర్ఎస్ పార్టీలు విద్యార్థులను అడ్డుపెట్టుకొని ఆందోళన కార్యక్రమాలు చేపడతాయని తెలిసినా వాటి వ్యూహాలను భగ్నం చేసే తంత్రాన్ని రచించకపోవడం.

4.సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ ఇమేజ్ దెబ్బతీసే ఒక పెద్ద బృందం కేటీఆర్ ఆధీనంలో ఉన్నట్టు పక్కా సమాచారం సీఎం దగ్గర ఉన్నప్పటికీ దుష్ప్రచారాన్ని తిప్పిగొట్టే ప్రచార సైన్యాన్ని రంగంలోకి దింపకపోవడం.

5.ఆందోళనకు దిగిన విద్యార్థులలో ఒక వర్గాన్ని తమకు సానుకూలంగా మలుచుకోవడంలో వైఫల్యం.

6. అన్నింటికన్నా ముఖ్యమైనది సమస్య తీవ్రతను ముందుగానే పసిగట్టలేకపోవడం.కొంత పసిగట్టగలిగినా నివారించలేకపోవడం.

7. ఈ అంశంపై ప్రతిరోజు ఒక మంత్రి మీడియా సమావేశాన్ని నిర్వహించి విపక్షాల కుట్రలను ఎండగట్టలేకపోవడం.

8. కాంగ్రెస్ పార్టీకి సొంతంగా మీడియా లేకపోవడం.

9. సోషల్ మీడియా బలహీనంగా ఉండడం.

10. యూనివర్సిటీలకు వందలాది ఎకరాలు ఎందుకు?అవేమైనా రాజా దర్బార్ లా? అంటూ గతంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యల వీడియోను సమర్ధంగా ప్రజల్లోకి తీసుకుపోవడంలో వైఫల్యం.