Jaganmohan Rao : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) లో జరిగిన భారీ ఆర్థిక , ఎన్నికల అవకతవకలపై తెలంగాణ నేర పరిశోధన విభాగం (సీఐడీ) దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో రోజురోజుకు కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఉప్పల్ స్టేడియం రికార్డుల స్వాధీనం నుండి నిందితుల విచారణ వరకు సీఐడీ కఠిన చర్యలు తీసుకుంటోంది. ఐదవ రోజు కూడా సీఐడీ కార్యాలయంలో ఐదుగురు నిందితులపై ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.
జగన్మోహన్ రావు ఎన్నికల్లో అవకతవకలు
హెచ్‌సీఏ అధ్యక్షుడిగా జగన్మోహన్ రావు చట్టవిరుద్ధంగా ఎన్నికైనట్లు సీఐడీ తమ ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారించింది. అసోసియేషన్ ఎన్నికల సమయంలో 23 ఇన్‌స్టిట్యూషన్ల తరఫున అక్రమంగా ఓట్లు వేయించినట్లు గుర్తించింది. అర్హతలేని ప్రతినిధులు ఓటింగ్‌లో పాల్గొనేలా రిజిస్ట్రేషన్ జరిపినట్టు ఆధారాలు దొరికాయి. మరింత షాకింగ్ విషయం ఏమిటంటే, నిజమైన సభ్యుల స్థానంలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఓట్లు వేసినట్లు సీఐడీ కనుగొంది. ఈ వివాదాస్పద ఓట్ల వలననే జగన్మోహన్ రావు విజయం సాధించినట్లు అధికారులు గుర్తించారు.
ప్రస్తుతం 2022-23 హెచ్‌సీఏ ఎన్నికల్లో ఎవరెవరు ఓటు వేశారన్న దానిపై విస్తృత విచారణ చేపట్టే ప్రయత్నంలో సీఐడీ ఉంది. ఈ ఓట్ల వెనుక ఎలాంటి ఒత్తిడి లేదా రాజకీయ ప్రాభావం ఉందన్న కోణంలో కూడా సీఐడీ దర్యాప్తు చేస్తోంది.
WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ను భారత్‌లో నిర్వహించకపోవడానికి గల కారణాలీవే!
ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు
ఉప్పల్ స్టేడియంలో స్వాధీనం చేసుకున్న ఆర్థిక లావాదేవీల రికార్డులను సీఐడీ అధికారులు ఒకటొక్కటిగా పరిశీలిస్తున్నారు. స్టేడియం క్యాటరింగ్ కాంట్రాక్టులను ఎలాంటి టెండర్ ప్రక్రియ లేకుండానే తమ అనుచరులకు కేటాయించినట్టు బయటపడింది. ఒక్కో ప్లేట్‌కు రూ.2,000 వరకు బిల్లులు వేశారు. ఈ ఖర్చులన్నీ హెచ్‌సీఏ నిధుల నుంచే చెల్లింపులు చేసినట్లు పత్రాలు బయటపడ్డాయి.
అంతేకాకుండా, 2024లో చెల్లించిన పవర్ బిల్లుల విషయాన్ని కూడా సీఐడీ పరిశీలిస్తోంది. గతంలో పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బిల్లులు చెల్లించకపోవడం వల్లే ఒక మ్యాచ్ సమయంలో స్టేడియం విద్యుత్ సరఫరా నిలిపివేసిన సంఘటనలను అధికారులు గుర్తు చేశారు.
సీఐడీ సోదాలు, నిందితులపై చర్యలు
విచారణలో భాగంగా సీఐడీ అధికారులు నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు, డాక్యుమెంట్లు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు సేకరించారు. రేపు నిందితులను కోర్టుకు హాజరు పరిచేందుకు సీఐడీ సిద్ధమవుతోంది.
ఈ విచారణలో బయటపడుతున్న వివరాలు హెచ్‌సీఏలో అవకతవకలు ఎంత లోతుగా జరిగాయో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. సీఐడీ దర్యాప్తుతో పాటు, క్రికెట్ అభిమానులు కూడా ఈ కేసు ఎలా మలుపు తిరుగుతుందో ఆసక్తిగా గమనిస్తున్నారు.
Parliament : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..విపక్షాల నిరసనలతో మొదటి రోజే ఉద్రిక్తత