Fact Check : హైదరాబాద్‌లో సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌ను కూల్చేశారా ? వాస్తవం ఇదీ

సైకిల్ ట్రాక్‌లోని కొంత భాగాన్ని తొలగిస్తున్న(cycling track demolished) ఒక వీడియోను తన ట్వీట్‌లో ఆయన జతపరిచారు.

Published By: HashtagU Telugu Desk
Fact Check Dismantling Of The Solar Roof Cycle Track Hyderabad Min

Fact Checked By Pasha

హైదరాబాద్‌‌లోని కోకాపేట సమీపంలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వెంట బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన 23 కి.మీ పొడవైన సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌‌పై రాజకీయ రగడ రాచుకుంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ట్వీట్ల యుద్దం నడుస్తోంది.  ఎవరి వాదనలో నిజం ఉంది ? అనే అంశాన్ని తెలుసుకునేందుకు ‘హ్యాష్‌ట్యాగ్ యూ తెలుగు’ ప్రయత్నించింది.

ప్రచారం ఇదీ.. 

‘‘హైదరాబాద్‌లోని కోకాపేట సమీపంలో ఓఆర్ఆర్ వెంట బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన 23 కి.మీ పొడవైన సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌‌‌‌ను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బ తీస్తోంది’’ అనే ప్రచారాన్ని సోషల్ మీడియా వేదికగా పలువురు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నారు.

కొణతం దిలీప్ ట్వీట్.. 

సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌‌ వ్యవహారంపై  తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం మాజీ డైరెక్ట‌ర్ కొణతం దిలీప్ డిసెంబరు 17న ఉదయం 11.42 గంటలకు  ఒక ట్వీట్ చేశారు. అందులో ‘‘సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌ను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోందా ? ఓఆర్ఆర్ వెంటనున్న సైక్లింగ్ ట్రాక్‌ను తొలగించడం చూసి నేను షాకయ్యాను. కేసీఆర్ హయాంలో రూపుదిద్దుకున్న ఘన నిర్మాణాలను తొలగించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం యత్నిస్తోందా ? ఎందుకీ పిచ్చి ? కేవలం రాజకీయ ప్రచారం కోసం ఇలాంటి విలువైన ప్రజా మౌలిక సదుపాయాలను తొలగించడం ఎందుకు ? మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ మానసపుత్రికే ఈ సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌. 23 కి.మీ మేర విస్తరించి ఉన్న ఈ ట్రాక్ ప్రపంచంలోనే రెండోది.  ఈ ప్రాజెక్టు ఎకో ఫ్రెండ్లీ ట్రాన్స్‌పోర్టేషన్‌‌ను అందిస్తుంది. సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తుంది’’ అని కొణతం దిలీప్ రాసుకొచ్చారు. సైకిల్ ట్రాక్‌లోని కొంత భాగాన్ని తొలగిస్తున్న(cycling track demolished) ఒక వీడియోను తన ట్వీట్‌లో ఆయన జతపరిచారు.

కేటీఆర్ ఏమన్నారు ?

సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌‌ వ్యవహారంపై  డిసెంబరు 17న సాయంత్రం 4.30 గంటలకు కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘‘ఇంతకంటే మూర్ఖమైన రాష్ట్ర ప్రభుత్వం మరొకటి మన దేశంలో ఉంటుందా ?’’ అని ఆయన ప్రశ్నించారు. కొణతం దిలీప్‌ డిసెంబరు 17న ఉదయం 11.42 గంటలకు  చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ కేటీఆర్ ఈ కామెంట్ పెట్టారు. కేటీఆర్ లాంటి అగ్రనేత ఈ ట్వీట్ చేయడంతో అందరూ అదే నిజమని భావించారు. కానీ క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే నిజం వేరే ఉందని తేలింది.  హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ), హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం అధికారులు చెప్పిన అంశాల ఆధారంగా వాస్తవాలను ‘హ్యాష్ ట్యాగ్ యూ తెలుగు’ నిగ్గుతేల్చింది.

నిజం ఏమిటి ? 

  • మొత్తం 23 కిలోమీటర్ల సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్‌లో కేవలం 80 మీటర్ల భాగంలో పైకప్పును తొలగించారు. నానక్‌రామ్‌గూడ, నార్సింగి ప్రాంతాల మధ్య ఈ పైకప్పు తొలగింపు జరిగింది.
  • నానక్‌రామ్‌గూడ టు నార్సింగి మార్గం ఐటీ కారిడార్‌లో ఉంటుంది. దీంతో అక్కడ ట్రాఫిక్ రద్దీ ఎక్కువ. ఆ 80 మీటర్ల భాగంలో సైకిల్ ట్రాక్ కారణంగా వాహనాలు సాఫీగా రాకపోకలు సాగించలేకపోతున్నాయి. దీంతో ఆ 80 మీటర్ల పరిధిలో సోలార్ పైకప్పును తీసివేయించారు.
  • ఆ 80 మీటర్లు మినహాయిస్తే.. మిగతా సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ మొత్తం చెక్కుచెదరకుండా సేఫ్‌గా ఉంది. అంతేకాదు దాని పరిధిలో సైక్లిస్టులు, వాహనదారుల సౌకర్యార్ధం హెచ్‌ఎండీఏ అధికారులు, ట్రాఫిక్ అధికారులు చాలా చర్యలు చేపట్టారు. సైక్లిస్టుల భద్రత కోసం.. సైకిల్ ట్రాక్ ఉన్న ఏరియాను అటాచ్ చేసే రోడ్లపై బోలార్డ్‌లు, స్పీడ్ బ్రేకర్లను నిర్మించారు. తద్వారా సైకిల్ ట్రాక్‌ పైనుంచి సైక్లిస్టులు రోడ్డుపైకి సడెన్‌గా  ఎంటర్ అయినా ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టారు.
  • ‘‘నార్సింగి, పుప్పాలగూడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నానక్‌రామ్‌గూడ రోటరీ మీదుగా ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, రాయదుర్గం, ఐకియా, మాదాపూర్‌ తదితర ప్రాంతాలకు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అందుకే సైకిల్ ట్రాక్‌లోని ఆ 80  మీటర్ల భాగంలో సైకిల్ ట్రాక్ పైకప్పును తీసేయాల్సి వచ్చింది. మిగతా సైకిల్ ట్రాక్‌ సేఫ్‌గానే ఉంది. బీఆర్ఎస్ వాళ్లు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు ’’ అని పేర్కొంటూ నవీన్ పెట్టెం డిసెంబరు 18న ఉదయం 11 గంటల 28 నిమిషాలకు ఒక పోస్ట్ చేశారు. తన వాదనను బలపర్చేలా ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’లో ప్రచురితమైన న్యూస్ క్లిప్‌ను ఆయన జోడించారు.

(ఈ న్యూస్ స్టోరీని ఒరిజినల్‌గా  హ్యాష్ ట్యాగ్‌యూ తెలుగు’ పబ్లిష్ చేసింది) 

  Last Updated: 19 Dec 2024, 06:40 PM IST