Site icon HashtagU Telugu

Kaleshwaram : కాళేశ్వరం ప్రాజెక్టు పై సంచలన వాస్తవాలతో హరీశ్‌రావు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌

Harish Rao's PowerPoint presentation on the Kaleshwaram project

Harish Rao's PowerPoint presentation on the Kaleshwaram project

Kaleshwaram : మేడిగడ్డ బ్యారేజీలో రెండు పిల్లర్లు కుంగిన నేపథ్యంలో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైందంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు అసత్యమని, అవాస్తవమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ నేత తన్నీరు హరీశ్‌రావు ఖండించారు. తెలంగాణ భవన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు 20.33 లక్షల ఎకరాలకు సాగునీరు అందించగలిగామని తెలిపారు. ఈ ప్రాజెక్టు రూపకల్పన సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా అంగీకరించిందని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన 45 రోజులకే మహారాష్ట్రకు వెళ్లి చర్చించి అంగీకారాన్ని తీసుకువచ్చామని చెప్పారు. కాళేశ్వరం అనేది కేవలం ఒక బ్యారేజ్‌ కాదు.

Read Also: Sugavasi Balasubramanyam : టీడీపీకి గుడ్ బై చెప్పిన సుగవాసి బాలసుబ్రమణ్యం

ఇది 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్‌స్టేషన్లు, 21 పంప్‌హౌసులు, 203 కి.మీ సొరంగాలు, 1,531 కి.మీ గ్రావిటీ కాలువలు, 98 కి.మీ ప్రెజర్‌ మెయిన్స్‌, 141 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన బహుళ గుణిత ప్రాజెక్టు. మొదట తమ్మిడిహట్టి వద్ద నీరు ఎత్తిపోసేలా ప్రాజెక్టును రూపొందించాం. అయితే అక్కడ నీటి లభ్యత తక్కువగా ఉండటంతో ప్రాజెక్టును మేడిగడ్డ వద్దకు మార్పు చేశాం అని వివరించారు. మేడిగడ్డ బ్యారేజీని 7 బ్లాకులుగా, మొత్తం 85 పియర్లతో నిర్మించామని, ఈ నిర్మాణం క్రమంగా పూర్తికావడంలోనే కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నా, దీని ఆధారంగా మొత్తం ప్రాజెక్టుపై నెగెటివ్ ప్రచారం చేయడం సరికాదన్నారు. కాళేశ్వరం వల్లే యాసంగిలో కూడా పంటలు పండాయని, ప్రస్తుతం మల్లన్నసాగర్‌ వరకు నిర్మించిన సౌకర్యాలు పూర్తి వినియోగంలో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా మూడు వేర్వేరు వనరుల నుంచి నీటిని సేకరించి వేలాది చెరువులను నింపగలగడం జరుగుతోందన్నారు. అంతేకాక, రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు గోదావరి జలాల్లో 940 టీఎంసీలు కేటాయించబడినప్పటికీ ఇప్పటివరకు 400 టీఎంసీలకు మించకుండా మాత్రమే వాటిని వినియోగిస్తున్నామని అన్నారు.

కాంగ్రెస్ పాలనలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును అనుమతులు పొందకుండా, నిర్మాణం ప్రారంభించకుండానే కాలువలు తవ్వడం ప్రారంభించారని విమర్శించారు. 2007లో ప్రాజెక్టు వ్యయాన్ని రూ.17 వేల కోట్లుగా ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం, 2011 నాటికి అది రూ.40 వేల కోట్లకు పెంచిన వాస్తవం ప్రజలు మరిచిపోకూడదు అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రాజెక్టుకు వచ్చిన సవాళ్లను రాజకీయంగా వాడుకోవడం కాకుండా, అవే దుర్బలతలుగా గుర్తించి పరిష్కార మార్గాలను అన్వేషించడం అవసరమని, ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని ఆయన సూచించారు.

Read Also: Delhi : ఢిల్లీ విమానాశ్రయంలో ఈనెల 15 నుంచి రోజుకు 114 దేశీయ విమాన సర్వీసులు రద్దు