Harish Rao: రేవంత్ కు హరీశ్ రావు బహిరంగ లేఖ.. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయంచేయాలంటూ!

  • Written By:
  • Updated On - March 12, 2024 / 05:09 PM IST

Harish Rao: మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు ప్రశ్నలు వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో అంశాలను లేవనెత్తిన ఆయన ఉద్యోగ నియమాకాలపై స్పందించారు. ఈ మేరకు ఆయన రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ‘‘గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియచేయు విషయం ఏమనగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం కోసం డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.

అయితే ఇటీవల కాలంలో టెట్ పరీక్ష నిర్వహించకపోవడం వల్ల దాదాపు 7 లక్షల మంది డిఎడ్, బిఎడ్ విద్యార్థులు డిఎస్సీకి దరఖాస్తు చేసుకోలేక పోతున్నారు. అంతేకాకుండా గత డిసెంబర్ నెలలో డీఎడ్ , బి.ఎడ్ కోర్సులు పూర్తి చేసుకున్న వారు దాదాపుగా 50వేల పై చిలుకు మంది ఉంటారు. టెట్ లో ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే డిఎస్సీకి దరఖాస్తు చేయడానికి అర్హులవుతారనే విషయం మీకు తెలిసిందే’’ అంటూ ఆయన స్పందించారు.

‘‘గత ఏడాది సెప్టెంబర్ లో బిఆర్ఎస్ ప్రభుత్వం టెట్ నిర్వహించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టెట్ నిర్వహించలేదు. టెట్ పరీక్ష కోసం దాదాపు 7 లక్షల పై చిలుకు మంది ఎదురు చూస్తున్నారు. టెట్ లో ఉత్తీర్ణత సాధించి, డిఎస్సీకి దరఖాస్తు చేసుకోవాలని ఆశతో ఉన్నారు. కాబట్టి, డీఎస్సీ నోటిఫికేషన్ తో పాటు, టెట్ నిర్వహించి విద్యార్థులు, నిరుద్యోగుల అవకాశాలు దెబ్బతినకుండా చూడాలని మనవి చేస్తున్నా’’ ఆ లేఖలో హరీశ్ రావు కోరారు.