మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి బహిరంగ లేఖ రాశారు. మల్లన్నసాగర్ నిర్వాసితుల (Mallanna Sagar Victims) సమస్యలపై స్పందిస్తూ.. గతంలో రేవంత్ రెడ్డి నిరాహార దీక్ష చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పట్లో నిర్వాసితులకు అండగా ఉన్న మీరు ఇప్పుడు సీఎం హోదాలో ఉన్నప్పుడు, వారి సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత మీపై ఉందని హరీష్ రావు తన లేఖలో పేర్కొన్నారు.
Delhi Election Results 2025 : తెలంగాణకు తాకిన ఢిల్లీ రాజకీయ సెగ
మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం 90% పనులు పూర్తిచేసిందని, మిగిలిన 10% పనులను వెంటనే పూర్తి చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ముఖ్యంగా కోర్టు తీర్పుల ద్వారా పరిహారం రావాల్సిన వారికి తక్షణమే న్యాయం చేయాలని, నిర్వాసితుల సహాయార్థం ప్రభుత్వం మరింత మెరుగైన పరిహారం అందించాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ చారిత్రాత్మకంగా ప్రకటించిన ప్యాకేజీ గురించి ఆయన లేఖలో ప్రస్తావించారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ప్యాకేజీ కింద ప్రతి నిర్వాసితుడికి గజ్వేల్ సమీపంలో 250 గజాల స్థలం, ఇంటి నిర్మాణానికి 5.04 లక్షలు, 7.50 లక్షల రూపాయల పరిహారం ఇచ్చామని హరీష్ రావు వివరించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షల పరిహారంతో పాటు 250 గజాల స్థలం కేటాయించారని, మొత్తం 1260 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఆయన తెలిపారు. ప్రభుత్వం మారిన తర్వాత మిగిలిన 10% పనులు పూర్తికావడం లేదని, ముంపు గ్రామాలకు చెందిన వితంతువులకు కూడా పరిహారం అందించేందుకు హైకోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు.